ప్రధాని, ముఖ్యమంత్రి సమావేశంలో మొత్తం విషయాన్ని’నీతి ఆయోగ్’ కి బదిలీ చేసేశారు. విభజన చట్టం ప్రకారం రావలసిన నిధులను, వెనుకబడిన ప్రాంతాలకు మామూలుగానే కేంద్రం ఇచ్చే నిధులను నీతిఆయోగ్ ముందు పెట్టవలసిన అగత్యమేమొచ్చిందో మోదీకే తెలియాలి. ఇదేమి పద్ధతి అని ప్రశ్నించలేకపోయిన చంద్రబాబుకే తెలియాలి. ప్రత్యేక హోదా విషయంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియంతృత్వ అహంభావం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనవసర వినయం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని అవమానిస్తున్నాయి. అప్పటి దిగ్విజయ్ సింగ్ వలె ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ నాటకాలమారితనం చిర్రెత్తిస్తోంది.
వెంకయ్య నాయుడిద్వారా ఆంధ్రుల్ని భ్రమపెట్టి నమ్మించిన బిజెపి సొంత మెజారిటీతో అధికారం లోకి వచ్చిన నాటినుంచే తీరు మార్చుకుంది. హోదా లేదని, హోదా పరిశీలిస్తామని, హోదా గురించి మరచిపోవడమే బెటరనీ, ఆపార్టీలో నానారకాల నాయకులు మాటలద్వారా, మీడియా లీకుల ద్వారా ప్రజల్ని మానసికంగా సంసిద్ధుల్ని చేసే మైండ్ గేమ్ ఆడుతున్నారు. రాష్ట్రవిభజన ఖాయమని తెలిశాక కూడా ఆప్రసక్తే లేదని అప్పుడు సీమాంధ్ర ప్రజల్ని మభ్యపెట్టిన కాంగ్రెస్ ఎంపిలు పార్టీతో సహా మట్టికొట్టుకుపోయారు. ప్రత్యేక హోదా పై తెలుగుదేశం ఎంపిలు ఇపుడు ఆదే పద్ధతిలో నాటకాలు ఆడుతున్నారు. హోదా రాదని ఆఫ్ ది రికార్డుగా గట్టిగా చెబుతున్న వీరు అదేమాట బాహాటంగా చెప్పకపోవడాన్ని బట్టి ఓట్లేసి గెలిపించిన ప్రజల్నే అవమానిస్తున్నారని స్పష్టమైపోతోంది.
మోదీకి ఫెడరల్ ధర్మాన్ని గోతిలో పాసేసే విషయంలో మొదటినుంచీ స్పష్టత వుంది. అందుకు ఉదాహరణ రాష్ట్రానికి ధర్మబద్ధమైన ప్రత్యేక హోదాను నిరాకరించడమే. అలాగే ఆయనకు ఇష్టారాజ్యం మీద అపారమైన మోజు వుంది. అందుకు ఉదాహరణ ఒక చక్రవర్తిని తలపింపచేసే విధంగా బీహార్ కు లక్షాఅరవై ఐదువేల రుపాయల నజరానాలను ప్రకటించడమే.
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రయోజనాలన్నింటినీ పొందడం, ఆంధ్రప్రదేశ్ ప్రజల న్యాయమైన హక్కు! ఇందులో ఎవరి దయాదాక్షిణ్యాలకు చోటు లేదు. రాష్ట్ర విభజనపై చర్చ సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయడం తదుపరి ప్రభుత్వాల ప్రజాస్వామిక సాంప్రదాయం మర్యాద. ప్రత్యేక తరగతి హోదా…వెనకబడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజి…వేరు వేరు అంశాలు. విభజన చట్టంలో పొందుపరచిన ఆర్ధిక వెసులుబాట్లకు అదనంగా ఈ రెండూ కూడా కేంద్రం నుంచి ఎపికి అందవలసిందే. సాగదీసి సాగదీసి కాలయాపన చేసిన కేంద్రప్రభుత్వం చివరికి ఆంధ్రప్రదేశ్ హక్కుని కూడా కేంద్రం దయాదాక్షిణ్యాల జాబితాలో పెట్టింది. ఇక పార్లమెంటులో ప్రశ్నించే, ప్రభుత్వంతో ప్రస్తావించే అవకాశాన్నే తొలగిస్తూ మొత్తం వ్యవహారాన్ని ప్రధానమంత్రి చైర్మన్ గా వున్న నీతి ఆయోగ్ కాళ్ళ ముందు పడేసింది. చంద్రబాబు నంగితనం మోదీ తెంపరితనం ఇందుకు దోహదపడ్డాయి
ఇందులో పూర్తినేరం నియంత మోదీది మాత్రమే కాజాలదు. చంద్రబాబు అస్పష్ట వైఖరిదికూడా. ఆయన రెండు నాలుకల ధోరణిది కూడా.ఈ పరిస్థితిపై కేంద్రాన్ని సూటిగా అడిగి రాష్ట్ర ప్రయోజనాలు సాధించాల్సిన ముఖ్యమంత్రి ప్రత్యేకహోదా కావాలని ఒకవైపు చెబుతూనే మరోవైపు అదిమాత్రమే సంజీవనీ కాదనడం, పేరు ఏదైనా భారీ సాయం చేస్తే చాలనడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ప్రత్యేక హోదా మాత్రమే ఇచ్చి, రాయితీలు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించడమూ ప్రజలను మభ్యపెట్టడమే. ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకి ప్రత్యేక హోదాకు, కేంద్రం విదిలింపుల మీద ఆధారపడే ప్యాకేజీలకు మధ్య ఉన్న తేడా తెలియదు అనుకోగలమా? నోటుకి ఓటు కేసులో తన పట్ల మెతకగా వ్యవహరించడానికి చంద్రబాబు రాష్ట్రప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టేశాలన్న జగన్ విమర్శలో సహేతుకత ఈ సందర్భంగా చర్చకు వస్తోంది.
ఢిల్లీలో పరిణామాలను సరిగా తెలుసుకోవడం లేదని కేంద్రమంత్రి సుజనా చౌదరిపై చికాకుపడిన చంద్రబాబు కూడా అదే పొరపాటు చేసినట్టు కనబడుతోంది. సొంతబలం, స్వరాష్ట్రపు మద్దతులను కంటే మోదీమీదే నమ్మకం పెట్టుకున్న ముఖ్యమంత్రి ఢిల్లీలో పెద్ద ఆశాభంగంతో తిరిగి వచ్చారు. ఎన్నికలు ముగిశాక అభివృద్ది గురించితప్ప రాజకీయాలు మాట్లాడను అని తరచు చెప్పే చంద్రబాబు అలాంటి వాతావరణాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేయడంలేదు.రాష్ట్రప్రయోజనాలు ఇమిడివున్న అంశాలపై అఖిలపక్ష సమావేశాలను ఏర్పాటు చేసే ప్రజాస్వామిక సాంప్రదాయాన్ని బాబు పక్కన పడేశారు. రాజధాని భూమిపూజకూడా మరేపక్షమూలేని చంద్రబాబు కుటుంబ కార్యక్రమన్నట్టు జరిగింది. ఇప్పటికైనా ఒంటెత్తు పోకడలు మానుకుని అఖిల పక్షాల మద్దతుకూడగట్టుకోవడం అవసరం.
ఏమైనాగాని మితిమీరిన మోదీ ఆధిక్యభావన, నిలదీయలేని బాబు న్యూనతాభావం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి. గౌరవాన్ని భంగపరుస్తున్నాయి.