తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ “ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలకి వెళ్తే ఎలాగుంటుంది?” అని తన పార్టీ సీనియర్ నేతలతో సమాలోచనలు చేస్తున్నట్లు మీడియాకి లీకులు ఇచ్చి మీడియాకి, ప్రతిపక్షాలకీ కొంచెం పని కల్పించారు. కేసీఆర్ అధికారం చేప్పట్టి ఇప్పటికి సరిగ్గా 14నెలలు అయింది. అంటే ఎన్నికల గురించి ఆలోచించడానికి ఇంకా మరో 44 నెలల సమయం మిగిలి ఉంది. ఇంకా ఇంత సమయం ఉంచుకొని అప్పుడే మధ్యంతర ఎన్నికల గురించి ఆలోచిస్తున్నట్లు మీడియాకి లీకులు ఇవ్వడం చూస్తే అది ప్రతిపక్షాలని త్రప్పు ద్రోవ పట్టించేందుకయినా అయి ఉండవచ్చు లేదా ఇతర పార్టీలలో నుండి తెరాసలోకి కొత్తగా వచ్చిన తలసాని, తుమ్మల, కడియం, డీ. శ్రీనివాస్ వంటి వారికి పదవులు పంచిపెడుతున్నందుకు పార్టీలో వినిపిస్తున్న అసమ్మతిని నియంత్రించేందుకయినా కావచ్చును. అయినా జి.హెచ్.యం.సి. ఎన్నికలను ఎదుర్కోవడానికే భయపడుతున్న తెరాస ప్రభుత్వం ఏకంగా మధ్యంతర ఎన్నికలకి వెళుతుందంటే నమ్మశక్యంగా లేదు. ఒకవేళ కేసీఆర్ నిజంగా మధ్యంతర ఎన్నికలకి వెళ్ళాలనుకొంటే తెరాసలోనే తిరుగుబాటు జరిగి ఆయన స్థానాన్ని మరెవరో ఆక్రమించినా ఆశ్చర్యం లేదు.