హైదరాబాద్: వంద మంచి మాటలు చెప్పటంకన్నా ఒక చిన్న మంచిపని చేయటం గొప్పదన్న సూత్రాన్ని అనుసరిస్తూ సమాజంకోసం తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడొక ఎన్ఆర్ఐ. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలను మెరుగుపరచటంకోసం ఒక కార్యక్రమాన్ని చేపట్టటమేకాకుండా తన ఏకైక కుమార్తెనుకూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రకాశంజిల్లా చీరాల పట్టణానికి చెందిన మాచిరాజు వంశీ అమెరికాలో మంచి ఉద్యోగాన్ని, గ్రీన్‌కార్డ్ పొందే అవకాశాన్నికూడా వదులుకుని 2013లో ఇండియాకు తిరిగొచ్చేశారు. హైదరాబాద్‌లో స్థిరపడిన వంశీ ‘ఆర్గనైజేషన్ ఫర్ ది ఫ్యూచర్’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాల మెరుగుదలకోసం, మహిళల స్వావలంబనకోసం, యువతలో నైపుణ్యాల అభివృద్ధికోసం ఈ సంస్థ పనిచేస్తోంది. పేదల అభ్యున్నతికోసం కృషిచేయాలంటే ముందు తానుకూడా వారిలో భాగంకావాలని తాను భావించిన వంశీ కాప్రాలో తానుండే కాలనీలోని స్కూల్ డెవలెప్‌మెంట్ టీమ్‌లో భాగస్వామిగా మారారు. తన కుమార్తెను మొదట ఒక ప్రైవేట్ పాఠశాలలో చేర్పించినప్పటికీ, తర్వాత కాప్రాలోని జిల్లాపరిషత్ హైస్కూల్‌లో మార్చారు. లలితా ప్రణీత అనే ఆ ఆమ్మాయి ప్రస్తుతం 8వ తరగతి చదువుతోంది. అమెరికానుంచి వచ్చిన ప్రణీతకు మొదట్లో ఇక్కడి క్లాస్‌మేట్స్‌తో, టీచర్లతో మాట్లాడటానికి ఇబ్బందిగా ఉండేది. అమెరికన్ స్కూల్స్‌లో చదువు చెప్పే విధానం, ఇక్కడి విధానం పూర్తి భిన్నంగా ఉందని ప్రణీత చెప్పింది. అమెరికా పాఠశాలల్లో చదువుకోవటం ఇంటరాక్టివ్‌గా ఉంటుందని, ఇక్కడంతా బట్టీపట్టమే ఉంటుందని పేర్కొంది. ప్రణీత, తండ్రి వంశీ కలిసి ఆమె క్లాస్‌లోని ఐదారుగురు పిల్లలకు పాఠాలు నేర్పుతున్నారు. మ్యాథ్స్, ఇంగ్లీష్, బయాలజీ, కంప్యూటర్స్ సబ్జెక్ట్‌లను చెబుతుంటానని ప్రణీత చెప్పింది. ఇక్కడి పాఠశాలలో తాను మంచి లైఫ్ లెసన్స్ నేర్చుకుంటున్నానని తెలిపింది.
మరోవైపు మాచిరాజు వంశీ కాలనీలో యువతలో నైపుణ్యాల అభివృద్ధికోసం, మహిళల స్వావలంబనకోసం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక అమెరికా వెళ్ళబోనని, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలేమీ చేయబోనని సమాజసేవపైనే దృష్టిపెడతానని అంటున్నారు. చేయగలిగిన్నాళ్ళు ఇది చేస్తానని, లేకపోతే తన గ్రామంలో వ్యవసాయం ఉండనే ఉందని వంశీ చెబుతున్నారు.