పెద్ద నోట్ల రద్దు తరువాత ఏర్పడిన ఉపద్రవాన్ని మూడు వారాల పాటు ఏదో విధంగా ఎదుర్కొన్న బ్యాంక్ లకు ఇప్పుడు నెల చివరిలో జీతాలు, పెన్షన్ లను చెల్లించడం అగ్నిపరీక్షగా మారనున్నది. ఈ ఆసాధారణ పరిస్థితులను ఎదుర్కోవడానికి దేశంలోని బ్యాంక్ లు అన్ని సిద్దమవుతున్నాయి.
నెలవారీ జీతాలు, పెన్షన్ లు తీసుకొనే లక్షలాది మంది ఒకేసారి రెండు, మూడు రోజులలో బ్యాంక్ ల నుండి డబ్బు తీసుకొనే అవకాశం ఉండడంతో ఈ వత్తిడిని ఎట్లా అధిగమించాలి అని బ్యాంక్ అధికారులు సతమత మవుతున్నారు. ఇప్పటీకే తమకు అధికంగా నోట్లను పంపాలని కోరుతూ రిజర్వు బ్యాంక్ కు లేఖలు పంపడం, వీరు కోరిన మొత్తంలో పాక్షికంగా అయినా నిధులను రిజర్వు బ్యాంక్ పంపడం జరిగిపోయింది.
ముందు జాగ్రత్తగా ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఆన్ లైన్ చెల్లింపులు చేయాలని ప్రభుత్వం సూచించింది. వారికి నగదు కాకుండా ప్రీ పెయిడ్ కార్డు లను ఇవ్వాలని కూడా సూచించారు.
ఈ పరిష్టితిని ఎదుర్కొంటామని బ్యాంక్ లు పైకి ధైర్యంగా కనిపిస్తున్నా అసలు ప్రజలు ఎంత మొత్తం తీసుకోవడానికి వస్తారో అంచనాలు లేక తికమక పడుతున్నారు. చాలాకాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు, అనేక ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులకు జీత భత్యాలను ఆన్ లైన్ లోనే చెల్లిస్తున్నారు. వారు ఆ మొత్తాలను ఒకేసారి బ్యాంక్ నుండి తీసుకోకుండా, అవసరాన్ని బట్టి తీసుకొంటూ ఉంటారు.
అయితే ఇప్పుడు బ్యాంక్ లలో ఏర్పడిన నగదు సంక్షోభం దృష్ట్యా పెద్ద మొత్తాలలో తీసుకొనే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అందుకనే బ్యాంక్ ల వద్దకు వచ్చి డబ్బు తీసుకొనే ప్రయత్నం చేసే వరకు ఎంత నగదు అవసరమో చెప్పలేని పరిస్థితులలో బ్యాంక్ లు ఉన్నాయి.
ఇప్పటికే ఉద్యోగ సంఘాలు నవంబర్ నెల జీతం మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించాలని కోరాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రు 10 వేలు మాత్రమే నగదుగా చెల్లించి, మిగిలిన మొత్తాన్ని వారి బ్యాంక్ ఖాతాలలో వేయనున్నారు.
గత వారం రోజులుగా డిమాండ్ మేరకు బ్యాంక్ లు నగదు చెల్లింపులు చేయలేక పోతున్నాయి. ఏ టి యం ల నుండి రోజుకు రు 2,500 వరకు, బ్యాంక్ బ్రాంచ్ ల నుండి వారానికి రు 24 వేలు వరకు తీసుకోవచ్చని ప్రభుత్వం చెప్పినా ఆ మేరకు బ్యాంక్ లలో నగదు లభ్యం కావడం లేదు. 70 శాతం ఏ టి యం లను కొత్త నోట్లకు అనువుగా మార్చిన్నట్లు చెప్పినా అవసరమైన నగదు అందుబాటులో లేక పోవడంతో చాలా ఏ టి యం లు మూసివేసే దర్శనం ఇస్తున్నాయి.
తమకు అవసరమైన నగదులో ఆర్ బి ఐ నుండి 35 నుండి 40 శాతంకు మించి అందటం లేదని బ్యాంక్ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే `నగదు రహిత ఆర్హ్దిక వ్యవస్థ’ అంటూ కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాలు తీసుకొంటున్న పలు చర్యల కారణంగా డిజిటల్ లావాదేవీలు జరుపుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండడంతో బ్యాంక్ లపై వత్తిడి సహితం ఆ మేరకు తగ్గ గలదని ఆశిస్తున్నారు.
తమకు అవసరమైన నగదుతో ఎనిమిదోవంతు కు మించి చాలా బ్యాంక్ బ్రాంచ్ లకు అందలేదని తెలుస్తున్నది. కొన్ని భారీ ప్రభుత్వ బ్యాంక్ లు కొంత నగదు మొత్తాలను తమవద్ద ఉంచుకొని, బ్రాంచ్ లకు కొద్దీ కొద్దిగా విడుదల చేస్తున్నాయి.