సినిమా తీయ్యడం ఒక ఎత్తు. దాన్ని జనంలోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. అందుకే దర్శక నిర్మాతలు మేకింగ్‌కి ఇచ్చినంత ప్రాముఖ్యత పబ్లిసిటీకీ ఇస్తుంటారు. దాన్ని హీరో, హీరోయిన్లు క్యాష్ చేసుకొంటుంటారు. వాళ్లకు పబ్లిసిటీ కావల్సినప్పుడు మాత్రం ‘ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లూ’ అంటూ హడావుడి చేసే తారాగణం.. సినిమాకి అవసరమైనప్పుడు మాత్రం ‘ఇప్పుడు ఖాళీ లేదు’ అంటూ తప్పించుకొంటుంటారు. చిత్రసీమలో దర్శక నిర్మాతలు ఇలాంటి షాక్‌లు అలవాటే. హీరోగా లెక్కకు మించి సినిమాలు తీసి, ఫ్లాపులు ఇచ్చి, డబ్బులు పోగొట్టుకొని, ఉన్నదంతా ఊడ్చేసి.. చివరికి క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డ ఓ నటుడు ఇప్పుడు అందులోనే బిజీ స్టార్ గామారాడు. మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకొన్నాడు. ఒక్కొక్క కాల్షీట్కీ లక్షలకు లక్షలు తీసుకొంటున్న ఆ నటుడు పబ్లిసిటీ కోసం అడిగితే మాత్రం… ‘సెపరేట్‌గా ఎంతిస్తారు?’ అని అడుగుతున్నాడట. దాంతో నిర్మాతలు ఖంగు తింటున్నారు.
అతను నటించిన ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైంది. దానికి సంబంధించిన ప్రమోషన్లు కూడా మొదలయ్యాయి. పబ్లిసిటీ కోసం ఆయన గార్ని కలిస్తే… ‘వస్తాను. కానీ రోజుకి ఇంతని ఇవ్వండి ‘ అంటూ షరతు పెడుతున్నాడట. దాంతో సదరు నిర్మాత ఖంగు తిన్నాడట. కనీసం ఒక్కరోజైనా ప్రమోషన్లకు సహకరించండి అని వేడుకొంటున్నా..కనికరించడం లేదని తెలుస్తోంది. ఈ సినిమా విషయంలోనే కాదు, ఇంతకు ముందు కూడా ఇదే వైఖరి అవలంభించాడట. ఈ నటుడే అని కాదు.. టాలీవుడ్లో చాలామంది హీరోలు, హీరోయిన్లు పబ్లిసిటీ అనగానే బేరాలు మొదలెడుతున్నారు.
అదేదో తమ సినిమా కాదన్నట్టు… ఉత్తి పుణ్యానికి పబ్లిసిటీకి వస్తున్నట్టు బిల్డప్పులు ఇస్తున్నారు. ఈమధ్య ఓ కథానాయిక పబ్లిసిటీకి రమ్మంటే.. ఏకంగా 5 లక్షలు అడిగిందట. చివరికి మూడు లక్షలకు బేరం ఒప్పించాడు సరదు నిర్మాత. ఇంతా పోజేస్తే. ఆడియో ఫంక్షన్‌కి వచ్చి రెండు మాటలు మాట్లాడి తుర్రుమంది ఆ కథానాయిక. అసలే టాలీవుడ్ కరువులో ఉంది. ఆస్తులన్నీ పోగేసి సినిమా తీసేసి.. చివరికి పబ్లిసిటీ చేసుకోవడానికి కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ పరిశ్రమపైనే బతుకుతూ.. నిర్మాత పుణ్యం వల్లే ఎదుగుతూ.. వాళ్లకే చుక్కులు చూపించడం ఏమిటి? ఖర్మ కాకపోతే..??