చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెం.150 పూర్తి కావొచ్చింది. ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడం లక్కీనే. ఆ అదృష్టం రామ్‌చరణ్ కొట్టేశాడు. ఎంతకాదన్నా ఈ సినిమాతో కనీసం రూ.20 కోట్ల వరకూ టేబుల్ ప్రాఫిట్ దక్కించుకొంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే.. సినిమా విడుదలకు ముందే చరణ్ సూపర్ సూపర్ హిట్ అయ్యాడన్నమాట. కొణిదెల బ్యానర్లో ఫస్ట్ సినిమాతోనే లాభాలు తెచ్చేసుకొన్నట్టే. మరయితే… నిర్మాతగా ఎవరెవరికి ఎంతెంత పారితోషికం ఇచ్చాడు. తీసుకోవడంలో ఉన్న ఇంట్రస్టు.. ఇవ్వడంలోనూ ఉందా? అని అడిగితే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చరణ్ నిర్మాతగా మహా పిసినారితనాన్ని ప్రదర్శిస్తున్నాడని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మేకింగ్ విషయంలో ఎలాంటి రాజీ పడకపోయినా, నటీనటులకు, సాంకేతిక నిపుణలుకూ పారితోషికం ఇచ్చే విషయంలో మాత్రం గీచి గీచి బేరాలు ఆడుతున్నాడని తెలుస్తోంది.
ఓ సినిమా మొదలెడుతున్నామంటే పారితోషికం ఎంత? అడ్వాన్సు ఎంత? మిగిలిన ఎమౌంట్ ఎప్పుడు ఇవ్వాలి? అనే విషయంలో ముందే బేరసారాలు జరిగిపోతాయి. కాకపోతే ఇది చిరంజీవి సినిమా. పైగా సొంత బ్యానర్. అందుకే ఎవ్వరూ పారితోషికం ఎంత? అని అడగలేదు. చరణ్ కూడా ఇంత ఇస్తానని చెప్పలేదు. కొంత అడ్వాన్స్ అందుకొని అందరూ పనిలోకి దిగిపోయారు. వినాయక్‌తో సహా. వినాయక్‌కీ చిరుకీ మధ్య మంచి అనుబంధం ఉంది. వినాయక్ కూడా చిరు ఇంట్లో సభ్యుడంతటి వాడే. అందుకే వినాయక్ పారితోషికంలో ఎలాంటి పేచీ పెట్టడు. ఇచ్చినంత తీసుకొంటాడు కూడా. మిగిలిన వాళ్లకూ ‘ఇచ్చినంత తీసుకోండి’ అనే పద్దతిలోనే పారితోషికాలు ఇస్తున్నారని తెలుస్తోంది. ఎవరైనా డిమాండ్ చేస్తుంటే.. వాళ్ల దగ్గర గీచి గీచి బేరాలు ఆడుతున్నారట. ఈ సినిమాకి సంబంధించిన పారితోషికం తదితర విషయాలను చరణ్ ఇద్దరు నిర్మాతలకు అప్పగించాడని, వాళ్లు ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. వాళ్లే.. పారితోషికాల్ని కుదించి ఇస్తున్నారట. చిరు సినిమాకి బాగానే గిట్టుబాటు అవుతుందనుకొన్నవాళ్లంతా ఇప్పుడు ఈ బేరాలు చూసి బేర్ మంటున్నారని టాక్.