పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించగానే ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ నిర్ణయం రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతోందని విరుచుకుపడ్డారు! ఏపీ సీఎం చంద్రబాబు కూడా కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తరువాత, కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధానికి కలిశారు. ప్రధాని ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి కేసీఆర్ను కలిశారు! ఏమైందో ఏమో… మోడీ నిర్ణయానికి మద్దతుగా కేసీఆర్ మాట్లాడటం మొదలుపెట్టేశారు. ఇక, ఏపీ సీఎం చంద్రబాబు తీరు కూడా ఇలానే మారిపోయింది! పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న కష్టాలకి కారణం బ్యాంకుల వైఖరే అంటూ తన విమర్శల్ని వాళ్లపైకి మళ్లించి… మోడీకి మద్దతుగా నిలుస్తున్నారు! తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వైఖరి ఇలా మారిపోవడంపై సీపీఐ నేత నారాయణ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై నారాయణ మండిపడ్డారు. నోట్ల రద్దు నిర్ణయంపై ఇద్దరు ముఖ్యమంత్రులూ మొదట విమర్శించారనీ, విచారం వ్యక్తం చేశారని అన్నారు. కానీ, అంతలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పొగుడుతూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఒక సామెత చెప్పారు! ఒంటె అందాన్ని చూసి గాడిద ఆశ్చర్యపోయిందనీ, అలాగే గాడిద గానాన్ని విని ఒంటె మూర్ఛపోయిందని నారాయణ చమత్కించారు. ఇద్దరు ముఖ్యమంత్రులూ ఇలానే వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇద్దరూ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలను పట్టించుకోవడం లేదని నారాయణ ధ్వజమెత్తారు.
కేంద్రంతో ఎలాగైనా దోస్తీ పెంచుకోవాలనీ, తద్వారా తన కుమార్తె కవితను కేంద్రమంత్రి చేయాలనే వ్యూహంలో కేసీఆర్ ఉన్నారన్నారు. అలాగే, చంద్రబాబు నాయుడు కూడా రాజకీయ భిక్ష కోసం పరితపిస్తున్నారనీ, కేంద్రం మద్దతు మరింతగా పొందాలని ఆయన ఆశిస్తున్నారని నారాయణ వివరించారు. అందుకే, ఇద్దరు ముఖ్యమంత్రులూ ఈ మధ్య ఇలా దిగజారిపోతున్నారని అన్నారు. వెలుగులు పంచే చంద్రుడికి ఒకటే మచ్చ కనిపిస్తుందనీ.. కానీ, ఈ ఇద్దరు చంద్రులకు ఒళ్లంతా మచ్చలే ఉన్నాయని నారాయణ ఎద్దేవా చేశారు.
నారాయణ విమర్శలు కాసేపు పక్కనపెడితే… వాస్తవంగా ఇద్దరు సీఎంల వాణిలో బాణిలో బాగా తేడా కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల సామాన్యుల పడుతున్న కష్టాల గురించి మాట్లాడటం మానేశారు! వాటి స్థానంలో క్యాష్ లెస్ లావాదేవీ, మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాలు గురించి మాట్లాడుతున్నారు. మరి, ఈ మాట మార్పు వెనక ప్రధాని వీరికి ఇచ్చిన భరోసా ఏదైనా ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి.