రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీ విరమణ వీడ్కోలు సభకు ముఖ్యమంత్రి హాజరు కావడం దేశ చరిత్రలో అరుదైన విషయం. తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ కొత్త సంప్రదాయానికి తెర తీశారు. మూడు దశాబ్దాలకు పైగా ఐఎఎస్ అధికారిగా దేశానికి, రాష్ట్రానికి సేవ చేసిన రాజీవ్ శర్మకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు.
తెలంగాణ రాష్ట్ర తొలి సి.ఎస్. గా రాజీవ్ శర్మ సేవలను కేసీఆర్ వేనోళ్ల కొనియాడారు. కొత్త రాష్ట్రంలో తొలి నియామకం ఆయనదేనని గుర్తు చేశారు. ఓపెనింగ్ బ్యాట్స్ మన్ తరహాలో ఆయన అద్భుతంగా పనిచేశారన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చాలా కృషి చేశారని ప్రశంసించారు. కొత్త చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర ఆల్ రౌండర్ గా పనిచేయాలని అభిలషించారు కేసీఆర్.
సచివాలయ ఆవరణలో, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీకి ఇంత ఘనమైన వీడ్కోలు పెద్ద విశేషమే. రాజీవ్ శర్మ రెండున్నర సంవత్సరాలుగా పాలనలో తనదైన ముద్ర వేశారని మంత్రులు, సచివాలయ ఉన్నతాధికారులు చెప్తుంటారు. ఆయన హయాంలోని టీఎస్ ఐపాస్ కు మంచి పేరు వచ్చింది.
రాజీవ్ శర్మ సేవలను ఇక ముందుకూడా ఉపయోగించుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఆయన్ని నియమిస్తున్నట్టు ప్రకటించారు. పైగా ఆయనకు కేబినెట్ మంత్రి హోదా ఇస్తానని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ఇక ముందు కూడా ఆయన పనిచేయాలని, ఆయనకు ఇప్పట్లాగే ఉద్యోగులు అందరూ సహకరించాలని కేసీఆర్ అన్నారు.
సాధారణంగా ఉద్యోగులు, అధికారులు పదవీ విరమణ చేస్తే సహోద్యోగులు వీడ్కోలు పలుకుతారు. మరీ అద్భుతంగా పనిచేసి ప్రజల పాలిట దైవంగా పేరు తెచ్చుకున్న కలెక్టర్ల వంటి వారికి స్వచ్ఛంద సంస్థల వారు సన్మానం చేస్తారు. కానీ రాజీవ్ శర్మకు కేసీఆర్ ఘన సత్కారం చేశారు. శాలువాతో సత్కరించి మెమొంటో బహూకరించారు.