ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అలవాటు! అదే తరహాలో ఈ మధ్య ఒక సర్వే చేయించుకున్నారు. ఆ సర్వే తెలుగుదేశం పార్టీకి అంత్యంత సానుకూలంగా వచ్చింది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సొంతంగా పోటీ చేస్తే 140 కిపైగా సీట్లు వస్తాయి. టూకీగా సర్వే ఫలితం ఇది! ఇలాంటి సర్వే వచ్చిదంటే ఏమనుకుంటాం… అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలూ నాయకులూ మంత్రులూ అందరూ ఫుల్ ఖుషీగా ఉంటారని అనుకుంటాం! కానీ, తెలుగు తమ్ముళ్ల పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని సమాచారం! పార్టీకి అత్యంత సానుకూలంగా సర్వే రావడం వ్యక్తిగతంగా నాయకులకు ఇబ్బందే అనే అభిప్రాయం వ్యక్తమౌతోందని చెప్పుకుంటున్నారు.
ఇంతకీ అసలు మతలబు ఏంటంటే… ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఎవరిమాటా వినడం లేదనే అభిప్రాయం నాయకుల స్థాయిలో ఉంది. పార్టీలో సీనియర్లుగానీ, జూనియర్లుగానీ, మంత్రులుగానీ, ఎమ్మెల్యేలుగానీ, ఇతర నాయకులు ఎవరైనాగానీ అంతా ఆయన చెప్పినట్టుగానే వినాలని అంటారట! ఆయన అనుకున్నదే చేస్తారనీ, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోరనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉంది. ఏ నిర్ణయంపైనా ప్రశ్నించే అవకాశం ఉండదట! చంద్రబాబు చెప్పిందే అందరూ వినాలి తప్ప, తిరిగి ఆయనకు సలహాలు ఇచ్చేంత సీన్ ఉండదంటారు. పరిస్థితి ఇలా ఉంటే… వాతావరణమంతా పార్టీకి అనుకూలంగా ఉందనే అభిప్రాయం సర్వే ద్వారా వ్యక్తం కావడంతో ఆయన ఎవరి మాటనూ లెక్కచెయ్యరు అని కొంతమంది దేశం నేతలే ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటున్నారు. ఆయన్ని మరింత చెడగొట్టడానికి ఈ సర్వే సరిపోతుందనే అభిప్రాయమూ వ్యక్తమౌతున్నట్టు తెలుస్తోంది.
నిజానికి, సర్వే అంతా సానుకూలంగా ఉన్నా… గోదావరి జిల్లాల రైతులు, రాజధానిలో భూములు కోల్పోయినవారు, పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చంద్రబాబు రెండు నాల్కల ధోరణి ఇలా కొన్ని వ్యతిరేకతలు ఉన్నమాట వాస్తవమే. ఈ సర్వే ద్వారా వ్యక్తమైన ప్రజాభిప్రాయం మరో రెండున్నరేళ్లపాటు స్థిరంగా ఉంటుందన్న గ్యారంటీ లేదు. కానీ, చంద్రబాబు లెక్కల ప్రకారం ఆయన ధీమా ఆయనకి ఉందనే చెప్పాలి! ఇంతకీ ఆ లెక్కేంటంటే… ఏపీలో చంద్రబాబుకు ప్రత్యామ్నాయం జగన్ అని ప్రజలు అనుకోవడం లేదని విశ్లేషించుకుంటున్నారట. పైగా, ప్రజా సమస్యల విషయంలో ఇంతవరకూ ప్రతిపక్ష పార్టీ సమర్థంగా పోరాటాలు చేసింది లేదనే అభిప్రాయమూ ఉందట. కాబట్టి, తాజా సర్వే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ను మరింత పెంచిందనీ, దాంతో పార్టీ నాయకులకే ఇబ్బందని భావిస్తున్నారట! ఏంటో… సర్వే సానుకూలంగా వచ్చినా సంబరాలు చేసుకోలేని పరిస్థితి తెలుగుదేశంలో ఉందన్నమాట!