పెద్ద నోట్ల రద్దు తరువాత దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను అధ్యయనం చేయడానికి ఒక కమిటీని కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో సమస్యలపై అధ్యయనం చేస్తుంది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్ సింగ్ చౌహాన్, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పడ్నవీస్తోపాటు మరికొంతమంది ప్రముఖులు ఈ కమిటీలో ఉన్నారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తిన సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో, నగదు రహిత లావాదేవీలను ఎలా ప్రోత్సహించాలో అనే అంశాలపై ఈ బృందం క్షుణ్ణంగా అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ కమిటీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని సారథిగా నియమించడం వెనక భాజపా ప్లాన్ వేరే ఉందని తెలుస్తోంది!
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఏరికోరి మరీ స్వయంగా చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి మరీ ఈ కమిటీ బాధ్యతల్ని ఇచ్చారు. అయితే, ఈ సీన్లోకి చంద్రబాబుకు తీసుకుని రావడం ప్రధాని మోడీకి పెద్దగా ఇష్టం లేదని చెప్పుకుంటున్నారు! ఎందుకంటే, పెద్ద నోట్ల రద్దుకు తానే ప్రధానికి సలహా ఇచ్చానని చెప్పుకున్నారు కదా. ఆ తరువాత, మాట మార్చేసి తన రాజకీయ జీవితంలో ఇంత పెద్ద సమస్యను ఎప్పుడూ చూడలేదని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు కదా. ఆయన తెలుగులో మాట్లాడినంత మాత్రాన విషయం మోడీ దాకా వెళ్లదనుకుంటే ఎలా..? మోడీ గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలన్నీ ఇంటలిజన్స్ వర్గాలు పూసగుచ్చినట్టు చేరవేశాయి. దీంతో చంద్రబాబుపై కాస్త అసంతృప్తిగా ఉన్నారట. అయినా సరే, ఈ కమిటీకి చంద్రబాబే ఉండాలని అరుణ్‌జైట్లీ పట్టుబట్టి ఒప్పించారని సమాచారం. ఇంతకీ ఏం చెప్పి ఒప్పించి ఉంటారో తెలుసా..?
పెద్ద సమస్యల్ని తాను మాత్రమే సాల్వ్ చేయగలనన్నట్టు చంద్రబాబు ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉంటారనీ, కాబట్టి ఇలాంటి తరుణంలో ఆయనకే బాధ్యతలు అప్పగిస్తే ఆ సత్తా ఏంటో తెలిసిపోతుందని మోడీకి జైట్లీకి చెప్పినట్టు సమాచారం! అలాగే, పెద్ద నోట్ల రద్దు తరువాత తప్పంతా భాజపాదే అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారనీ, అందుకే ఎవరైతే ఎక్కువ విమర్శలు చేస్తారో వారికే ఇలాంటి బాధ్యతలు అప్పగిస్తే సైలెంట్‌గా ఉంటారని జైట్లీ కన్వెన్స్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. సో… ఇది చంద్రబాబుకు కేంద్రం ఇచ్చిన బాధ్యత కాదన్నమాట! చంద్రబాబుకు భాజపా చేసిన సవాల్ అని అర్థం చేసుకోవాలన్నమాట. మరి, ఈ బాధ్యత లాంటి సవాల్‌ను చంద్రబాబు ఎలా ధీటుగా ఎదుర్కొంటారో వేచి చూడాలి.