సుదీర్ఘ నిరీక్షణకు బ్రేక్ పడింది. ఎన్టీఆర్ తదుపరి సినిమా ఎవరితో అనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్ – బాబి కాంబో సెట్స్‌పైకి వెళ్లడానికి సన్నాహాలు జరిగిపోతున్నాయి. అయితే ఈ సినిమా తరవాత ఎన్టీఆర్ సినిమా ఏమిటి? ఎవరితో అనే విషయంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహాలూ అవసరం లేదు. ఆ సినిమా కచ్చితంగా త్రివిక్రమ్ తోనే ఉండబోతోంది. బాబి సినిమా ఫినిష్ అవ్వగానే త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కించడానికి ఎన్టీఆర్ డిసైడ్ అయిపోయాడు. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబో 2017 ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లనున్నది తెలుస్తోంది. ఎన్టీఆర్ – బాబి సినిమా పూర్తయ్యేలోగా, పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ సినిమా కూడా ఫినిష్ అవుతుంది. అంటే ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఒకేసారి ఖాళీ అవుతారన్నమాట.
ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ ఎప్పుడో సినిమా చేయాల్సింది. అన్నీ ఓకే అనుకొన్న తరుణంలో.. ఆ సినిమా చివరి క్షణాల్లో చేతులు మారేది. ఎన్టీఆర్‌తో కొన్ని కమర్షియల్ యాడ్స్ షూట్ చేశాడు త్రివిక్రమ్. అప్పటి నుంచీ.. ఇద్దరూ కలసి పనిచేద్దామనుకొన్నారు. జనతా గ్యారేజ్ తరవాత ఎన్టీఆర్ త్రివిక్రమ్‌తోనే సినిమా చేద్దామనుకొన్నాడు. అయితే అప్పటికే త్రివిక్రమ్ – పవన్ ల సినిమా ఫిక్సయిపోవడంతో కుదరలేదు. కానీ అప్పటికే ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ కథని సిద్దం చేసుకోవడం జరిగిందని సమాచారం. సో.. కథ రెడీగా ఉంది కాబట్టి, పవన్‌తో సినిమా పూర్తయ్యాక ఎన్టీఆర్ సినిమాని పట్టాలెక్కించడానికి పెద్దగా సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు. 2018 వేసవికి ఎన్టీఆర్ – త్రివిక్రమ్‌ల సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది.