ఐటీ హబ్ గా దేశంలో నెంబర్ వన్ గా ఎదిగేలా హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలనేది తెలంగాణ ప్రభుత్వ సంకల్పం. వీలైనంత త్వరగా బెంగళూరును అధిగమించాలనేది లక్ష్యం. ఈ దిశగా ఐటీ కంపెనీలు నగరానికి క్యూ కట్టేలా చేయడంలో టీఎస్ ఐపాస్ వంటి పథకాలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి. నగరంలో ఐటీ ఆఫీస్ స్పేస్ వినియోగం భారీగా పెరిగింది.
దేశంలోని 8 పెద్ద నగరాల్లో మొత్తం ఆఫీస్ స్పేస్ 32.4 మిలియన్ చదరపు అడుగులు. అందులో హైదరాబాద్ వాటా 18శాతానికి పెరిగింది. అయితే బెంగళూరుకు ఇంకా చాలా దూరంలోనే ఉంది. ప్రస్తుతం బెంగళూరు 32 శాతంతో హైదరాబాద్ కంటే చాలా ముందుంది.
హైదరాబాద్ నుంచి ఐటీ ఉత్పత్తులు 75 వేల కోట్ల మైలురాయిని దాటాయి. లక్షకోట్ల లక్ష్యం సాధించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు, బీపీఎం, ఫార్మా రంగాల్లోనూ హైదరాబాద్ ప్రముఖ కేంద్రంగా ఎదిగింది. ఒక్క ఐటీ రంగం విషయాన్ని పరిశీలిస్తే ఆఫీస్ స్పేస్ వినియోగం దాదాపు రెట్టింపయింది.
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు హైదరాబాదులో 60 లక్షల చదరపు అడుగుల ఐటీ స్పేస్ వినియోగం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ అధికారికంగా చెప్పిన లెక్క ఇది. గతంలో ఎప్పుడూ ఇది 30 లక్షల చదరపు అడుగులకు మించలేదు.
హైదరాబాద్ ఐటీ ఎగుమతులు 50 వేల కోట్ల కు చేరితేనే గొప్ప అనుకునే పరిస్థితి ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు లక్ష కోట్ల దిశగా దూసుకుపోతోంది. అయితే ఈ వేగం సరిపోదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే బెంగళూరు ఐటీ ఎగుమతులు దాదాపు 2 లక్షల కోట్లు. కాబట్టి లక్ష్యం పెద్దదే అయినా ప్రయత్నిస్తే పోయేది ఏమీ లేదనే తరహాలో కేసీఆర్ ప్రభుత్వం వీలైనన్ని ప్రయత్నాలుచేస్తోంది. ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది.