కొన్ని సినిమాల్లో కథంటూ ఉండదు. కానీ.. అదో అందమైన ప్యాకేజీలా ఉంటుంది. చిన్న కథనే.. అందంగా ముస్తాబు చేయడం కనిపిస్తుంది. పైపైన హంగులు ఎక్కువగా అద్దుతుంటారు. సాధారణంగా ఇలాంటి ప్యాకేజీ తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. మలయాళంలో అయితే కథకి ప్రాధాన్యం ఇస్తూ, పాత్రల్ని ఉన్నతంగా, వీలైనంత బలంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ… పులిమురుగన్ మాత్రం ఇందుకు రివర్స్ లో సాగిన ఎటెమ్ట్. కథ, కథనాలు బలహీనంగా, వాటిని తెరపై ఆవిష్కరించిన విధం అందంగా ఉంటుంది. దాంతో మల్లూవుడ్ ప్రేక్షకులకు ఈ సినిమా ఓ సరికొత్త అనుభూతి ఇచ్చింది. మలయాళంలో వంద కోట్లు సాధించిన సినిమాగా రికార్డులు సృష్టించింది పులి మురుగన్. ఈ సినిమా తెలుగులో ‘మన్యం పులి’ పేరుతో విడుదల చేశారు. మరి.. తెలుగు ప్రేక్షకులకూ అదే రకమైన అనుభూతి కలిగించిందా, లేదా? మన్యం పులి ఎలాంటి సినిమా..??
* కథ
పులి (మోహన్ లాల్) పులుల్ని వేటాడడంలో దిట్ట. తన భార్య మైనా (కమలిని ముఖేర్జీ). ఓ కూతురు. అడవిలో నివశిస్తుంటారు. ఆ అడవిలో నివసిస్తున్న ప్రజలకు పులి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా… పులి కాపాడుతుంటాడు. అందుకే పులిని అందరూ ప్రేమగా మన్యం పులి అని పిలుచుకొంటుంటారు. డాడీ (జగపతి బాబు) కన్ను ఈ అడవిపై పడుతుంది. అడవి నుంచి గంజాయిని ఎత్తు కెళ్లాలన్న పన్నాగంతో అడవిలో తిష్ట వేస్తాడు. ఆ గ్రామాన్ని ఖాళీ చేయించాలని చూస్తుంటాడు. పులులను వేటాడడానికి పులిని నియమించుకుంటాడు. డాడీ అసలు రంగుని పులి ఎలా బయటపెట్టాడు? డాడీ అక్రమాల నుంచి ప్రజలను ఎలా కాపాడాడు? అనేదే ఈ చిత్ర కథ.
* తెలుగు 360 విశ్లేషణ
అడవి నేపథ్యంలో సాగే సినిమాల్లో ఇంతకంటే పెద్ద కథేం ఉండదు. మన్యం పులి కథలో మలుపులేం లేవు. చాలా సాదా సీదాగా సాగిపోతుంటుంది. కథగా చూస్తే.. ఈ సినిమా మలయాళంలో వంద కోట్లు ఎలా తెచ్చుకొందో అర్థం కాదు. కానీ.. దాన్ని తెరపై తీసుకొచ్చిన విధానం మాత్రం రక్తి కట్టిస్తుంది. హాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితం అనుకొనే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్.. మాస్ కి నచ్చే సీన్లు, అన్నింటికంటే మోహన్ లాల్ వన్ మ్యాన్ షో ఈ సినిమాని నిలబెట్టేశాయి. సినిమా ప్రారంభమే జెట్ వేగంతో ఉంటుంది. తొలి అరగంట సన్నివేశాలు ఊపిరి తీసుకోనివ్వవు. ఆ అరగంటకే టికెట్టు రేటు గిట్టుబాటు అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా అంతా అదే స్థాయి ఉంటే.. కచ్చితంగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇదో క్లాసిక్ అవుదును. అరగంట ముగిశాక… జగపతి బాబు ఎంట్రీ ఉంటుంది. అక్కడి నుంచి కథలో గ్రాఫ్ అమాంతం పడిపోతుంది. మోహన్ లాల్, జగపతిబాబు, గంజాయి నేపథ్యంలో సాగే సీన్లు విసుగు పుట్టిస్తాయి. మళ్లీ విశ్రాంతి కార్డు దగ్గర దర్శకుడు తన ప్రతాపం చూపించాడు. సెకండాఫ్ కూడా చాలా నిదానంగా మొదలవుతుంది. కథకు సంబంధం లేని విజయాలేవో జరిగిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. అది విశ్వరూపం దాల్చేలోగా మళ్లీ ఓ అబ్బుర పరిచే యాక్షన్ సీన్ వస్తుంది. మళ్లీ చివరి ముఫ్ణై నిమిషాలూ ఊపిరి తీసుకోనివ్వదు. మొత్తంగాచూస్తే ఇదో యాక్షన్ థ్రిల్లర్. యాక్షన్ ప్రియుల్ని దృష్టిలో ఉంచుకొని తీసిన సినిమా. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాకి దర్శకుడు పీటర్ హెయిన్స్ అని చెప్పాలి. అతను రూపొందించిన సీన్స్ ఈ సినిమాకి ప్రాణం పోశాయి. మన్యం పులిని మరో స్థాయిలోకి తీసుకెళ్లాయి. వాటి మధ్యలో సాగే కథ మాత్రం బోర్ కొట్టిస్తుంది. నిజంగా కథ, కథనాలు కూడా సమర్థవంతంగా నడుపుకొంటే.. మన్యం పులి ఓ గొప్ప సినిమాగా మిగిలిపోదును.
* ఆర్టిస్ట్ పెర్‌ఫార్మ్సెన్స్
ఇది మోహన్ లాల్ వన్ మ్యాన్ షో. అంతకు మించిన మాట లేదు. మోహన్ లాల్ కోసం ఈ సినిమా చూడాల్సిందే. అరవై ఏళ్ల వయసులో అలాంటి యాక్షన్ సీన్స్ ని పండించడం మామూలు విషయం కాదు. మలయాళంలో తనెందుకు సూపర్ స్టార్ అనిపించుకొంటున్నాడో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అతని ముందు మిగిలిన అన్ని పాత్రలూ తేలిపోయాయి. జగపతిబాబుతో సహా. ఈ సినిమాలోనూ జగ్గూభాయ్ రొటీన్ విలనిజం పండించాడు. కమలినీ ముఖర్జీ పాత్ర, దాన్ని తీర్చిదిద్దిన విధానం ఆశ్చర్యపరుస్తాయి. ఎందుకో కమలిని వయసుమళ్లినదానిలా కనిపించింది. నమితది ఏ మాత్రం ప్రాధాన్యం లేని పాత్ర. మాస్ కోసమే ఆ పాత్రని డిజైన్ చేశారేమో.
* టెక్నికల్‌గా..
టెక్నికల్‌గా ఈ సినిమాకి వందకు వంద మార్కులు పడతాయి. ఫొటోగ్రఫీ చూడముచ్చటగా ఉంది. ఇది వరకు చూడని లొకేషన్లు కనిపిస్తాయి. యాక్షన్ సీన్స్ లో ఫొటోగ్రఫీ ప్రతిభ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకొంటుంది. కథ, కథనాల దృష్ట్యా దర్శకుడు తప్పటడుగు వేశాడు. ఓ రొటీన్ కథని అద్భుతమైన యాక్షన్ దృశ్యాల మధ్య ఇరికించేశాడు. పతాక సన్నివేశాలకు ముందు కనిపించే సీన్లు నిజంగానే బోర్ కొట్టిస్తాయి. ఆయా సన్నివేశాల్ని వీలైనంత కుదించుకొంటే బాగుండేది. బీ, సీ ఆడియన్స్‌కు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. విజువల్ ట్రీట్ కావాలనే మల్టీప్లెక్స్ ఆడియన్స్ కూడా ఈసినిమాకి ఓటేసే అవకాశం ఉంది. ఓవరాల్ గా మలయాళ సినిమాని మరో రేంజ్‌కి తీసుకెళ్లిన టెక్నికల్ ఎఫెక్ట్… ఈ సినిమా. మోహన్ లాల్ కోసం.. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ కోసం.. అన్నింటికి ముఖ్యంగా పులి ని వేటాడే సన్నివేశాల కోసం ఈ సినిమా చూడొచ్చు,
తెలుగు360 రేటింగ్: 2.75