హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి భూసేకరణ డైలీ సీరియల్లాగా రోజుకో మలుపు తిరుగుతోంది. పవన్ కళ్యాణ్ పర్యటన ప్రభావమో, రైతుల వ్యతిరేకతో తెలియటంలేదుగానీ, భూసేకరణను నిలిపిపేయాలని, జీవోను రద్దుచేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటినుంచీ భూసేకరణ వద్దంటూనే ఉన్నారని, అయినా సమయం ముంచుకొస్తుండటంతో ఆయనకు తెలియకుండా తాను భూసేకరణ నోటిఫికేషన్ జారీచేయించానని మంత్రి నారాయణ ఇవాళ చెప్పుకొచ్చారు. భూసమీకరణకు రైతులను ఒప్పించి భూములను తీసుకోవాలన్నదే సీఎమ్ అభిమతమని అన్నారు. పవన్ చెప్పినట్లుగానే భూములిచ్చేందుకు అందరు రైతులనూ ఒప్పిస్తామని వారి ఇష్టప్రకారమే భూములు తీసుకుంటామని ఎవరినీ బలవంతం పెట్టబోమని చెప్పారు. గ్రామకంఠాలపై రైతులు ఆందోళన పడనవసరంలేదని, సోమవారంలోగా ఈ సమస్యను పరిష్కరిస్తామని మంత్రి అన్నారు.
మరోవైపు రాజధానికి భూసేకరణ విషయంలో నిన్న మీడియాతో మాట్లాడుతూ అసంతృప్తిని వ్యక్తం చేసిన ఉపముఖ్యమంత్రి ఇవాళ వెనక్కు తగ్గారు. రెవెన్యూశాఖను చూస్తున్న కేఈ, తనకు తెలియకుండానే భూసేకరణ జరుగుతోందని, భూ సేకరణ అవసరంలేదని, నారాయణ పెత్తనంపై మాట్లాడబోనని నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఒక్కరోజులోనే ఏమయిందో ఏమోగానీ, మీడియా తన మాటలను వక్రీకరించిందని ఇవాళ అన్నారు. ఈ విషయంలో తనకూ, మంత్రి నారాయణకు విభేదాలు లేవని అన్నారు. రాజధానికోసం 33వేల ఎకరాలను సేకరించిన నారాయణను తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని చెప్పారు.
ఇద్దరు మంత్రుల మాటలలో నారాయణ మాటలు గమనిస్తే, భూసేకరణ రివర్స్ అయ్యేటట్లుందని గమనించిన ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు స్పష్టమవుతోంది. అయితే నింద తనపై వేసుకుని ఈ విషయంలో సీఎమ్ను తప్పిద్దామని నారాయణ ప్రయత్నించినట్లు కనబడుతోంది. మరోవైపు రెవెన్యూమంత్రినైన తనకు తెలియకుండా భూసేకరణ జరపటంపై, దానిలో నారాయణ ప్రమేయంపై మొదటినుంచీ గుర్రుగా ఉన్న కేఈ నిన్న మీడియాముందు ఆ అసంతృప్తిని వెళ్ళగక్కారు. సీఎమ్ చెప్పారో, ప్రతిపక్షాలు, ప్రజల దృష్టిలో పలచనవుతుందనోగానీ ఇవాళ మళ్ళీ వెనక్కు తగ్గారు.