కాపులకు రిజర్వేషన్లు… ఎప్పుడో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ! అధికారంలోకి వచ్చాక దాన్ని పక్కనపడేశారు. దాన్ని సాధించడం కోసమే కాపుల ఉద్యమం మొదలైంది. ముద్రగడ పద్మనాభం ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. అయితే, ఆ ఉద్యమం ఆశించిన స్థాయిలో ముందుకు సాగుతోందా..? కాపుల డిమాండ్లకు అద్దం పడుతోందా..? ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచుతోందా..? – ఇలాంటి ప్రశ్నలు మరోసారి ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎందుకంటే, మరోసారి ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు ముద్రగడ పద్మనాభం!
కాపు జేఏసీ సమావేశం అనంతరం ఉద్యమ కార్యాచరణను ముద్రగడ తెలిపారు. ఈ నెల 18న నల్ల బ్యాడ్జీలు ధరించి కంచాలూ గరిటెలతో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. అలాగే, ఈ నెలాఖరున ప్రజాప్రతినిధులకు పెద్ద సంఖ్యలో వినతి పత్రాలు అందించబోతున్నట్టు తెలిపారు. జనవరి 8న కొవ్వొత్తుల ప్రదర్శన, అదే నెల 20న సత్యాగ్రహ పాదయాత్ర చేయబోతున్నట్టు ప్రకటించారు. రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ ఈ యాత్ర నిర్వహిస్తానని చెప్పారు. అయితే, నవంబర్‌లో కూడా ఇదే యాత్రను తలపెట్టినా, అది సక్సెస్ కాలేదు. ఈ పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ముద్రగడ కూడా అనుమతి కోరిందిలేదు! జనవరిలో తలపెడుతున్న పాదయాత్రకు కూడా పోలీసుల అనుమతి కోరే ప్రసక్తే లేదని ముద్రగడ ఇప్పుడే స్పష్టం చేశారు. రిజర్వేషన్ల అంశమై ఇప్పటికే తెలుగుదేశం సర్కారుకు చాలా సమయం ఇచ్చామని, ఇంతవరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేకపోవడంతో మరోసారి ఉద్యమించాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు.
కార్యాచరణ ప్రణాళిక బాగానే ఉంది. కానీ, దాని అమలు విషయంలోనే గతం రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన తరుణమిది. కాపుల రిజర్వేషన్ల అంశం ఏపీలో బలంగానే వినిపిస్తోంది. ఇదేదో నాయకుల స్థాయి ఉద్యమంగా కాకుండా… ప్రజల నుంచే సహజ స్పందన ఉంది. కానీ, ఆ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగా ఉద్యమాన్ని నడపడంలో ముద్రగడ తడబడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమౌతూనే ఉంది. ఇంతవరకూ ఉద్యమం అంటే ఆయన వ్యక్తిగత భావావేశాలకు, స్పందనలకూ వేదికలుగా మారుతూ వచ్చాయి! కనీసం ఈసారైనా పంథా మార్చుకుంటే ఉద్యమానికి మాంచి ఊపు రావడం ఖాయమనే అభిప్రాయం ఉంది. కానీ, గతంలో మాదిరిగానే తాను చేపట్టబోతున్న పాదయాత్రకు పోలీసుల నుంచి అనుమతులు తీసుకునేందుకు ఆయన సిద్ధపడటం లేదు. కాబట్టి, ఈసారి కూడా పోలీసుల నుంచి గృహనిర్బంధం లాంటివి ఉండవని చెప్పలేం కదా!
తన పాదయాత్రకు పోలీసుల అనుమతి కోరితే తప్పేముంది..? ఒకవేళ అనుమతులు ఇవ్వకపోతే… అది కూడా ప్లస్‌గా మార్చుకునే అవకాశం ఉంటుంది కదా! కాపుల ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేస్తోందని చెప్పడానికి అనుమతు ఇవ్వకపోవడమే నిదర్శనం అని బలంగా చెప్పుకోవచ్చు కదా!