2016లానే.. 2017 సంక్రాంతికీ తన సినిమాతో సందడి చేద్దామనుకొన్నాడు నాగార్జున. తన ఓం నమో వేంకటేశాయ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకురావాలని చాలా ప్రయత్నించాడు. అయితే.. విజువల్ ఎఫెక్ట్స్ పని ఎక్కువగా ఉండడం, సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఉండడంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోక తప్పలేదు. మరి ఓం నమో వేంకటేశాయ ఎప్పుడొస్తుంది?? అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు దానికి సమాధానం దొరికింది. ఈ చిత్రాన్ని 2017 ఫిబ్రవరి 10న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయం తీసుకొంది. రిలీజ్ డేట్‌ని అధికారికంగా త్వరలో ప్రకటిస్తారు. అనుష్క, ప్రగ్యాజైస్వాల్, మధురిమ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఎస్.గోపాలరెడ్డి ఛాయాగ్రహణం అందించారు.
ఈ సినిమా కోసం దాదాపు 20 సెట్లు వేశారట. తిరుమల తిరుపతి దేవస్థానానికి రిప్లిక ఈ సినిమాలో కనిపించబోతోందని, ఆ సెట్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని తెలుస్తోంది. దాదాపు 40 నిమిషాల పాటు గ్రాఫిక్స్వర్క్స్ ఉంటాయి. అందుకోసం ప్రఖ్యాత కంపెనీలు పనిచేస్తున్నాయి. పాండురంగడు, శిరిడీసాయి సినిమాల్లో గ్రాఫిక్స్ తేలిపోయాయి. ఈ సినిమాలో ఆ పొరపాటు జరక్కూడదని రాఘవేంద్రరావు భావిస్తున్నారు. అందుకే గ్రాఫిక్స్ కోసం వీలైనన్ని ఎక్కువ రోజులు కేటాయించారు. అనుష్కతో పోలిస్తే ప్రగ్యా జైస్వాల్ పాత్ర హాట్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. నాగార్జున, ప్రగ్యాలపై తెరకెక్కించిన పాట రాఘవేంద్రరావులోని రొమాంటిక్ కోణాన్ని ఆవిష్కరించబోతోందని చెప్పుకొంటున్నారు.