ప్రస్తుతం వంగవీటి ఆడియో ఫంక్షన్ విజయవాడలో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఝాన్సీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. అయితే.. ఆడియో వేడుక దగ్గర కొంతమంది నానా రగడ చేయడం మొదలెట్టారు. డయాస్ ముందుకు వచ్చి.. కార్యక్రమం సజావుగా సాగకుండా అడ్డుపడడం కనిపించింది. ముందు కాస్త సౌమ్యంగానే వాళ్లని వారించిన ఝాన్సీ ఆ తరవాత వీరావేశం చూపించింది. ”విజయవాడ వస్తే ఇలాగేనా గౌరవించేది..?” అంటూ విరుచుకుపడింది. ఆ గుంపులో కొంతమంది పవన్ కల్యాణ్ పోస్టర్లు పట్టుకొని కనిపించడంతో వాళ్లంతా పవన్ ఫ్యాన్స్ అని భావించిన ఝాన్సీ ”క్రమశిక్షణ ఆయుధంగా మీ హీరో మంచి పేరు తెచ్చుకొన్నాడు. ఆ హీరోకి మచ్చలా తయారయ్యారు. ఈ 50 మంది వల్ల ఆయన అభిమానులకు చెడ్డపేరు వస్తుంది. మీరంతా మచ్చ తనకలు.. ” అంటూ మైకు పట్టుకొని ఆవేశంతో ఊగిపోయింది. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సివచ్చింది. ఆల్ యాక్సిస్ కార్డు ఉన్నప్పటికీ చాలామందిని బయటకు పంపేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఆడియో ఫంక్షన్ సజావుగా సాగుతుందా, లేదంటే.. ఇలాంటి స్పీడ్ బ్రేకర్లు పడతాయా అన్నది ఫంక్షన్ పూర్తయ్యే వరకూ తెలీదు.