పెద్దనోట్ల రద్దు తర్వాత దేశ వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు పెరిగాయి. డబ్బుకోసం ఇబ్బంది పడుతున్న జనం, ఎంతో కొంత ఆన్ లైన్ ద్వారా లావాదేవీలు జరపడానికి ముందుకొస్తున్నారు. తెలంగాణను క్యాష్ లెస్ లావాదేవీల్లో దేశానికే ఆదర్శంగా మార్చాలని కేసీఆర్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం అనేక ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు. పెద్ద నోట్ల రద్దును సమర్థించిన కేసీఆర్, పారదర్శకత కోసం నగదు రహిత లావాదేవీలను పూర్తి స్థాయిలో ప్రోత్సహించడానికి నిర్ణయించారు.
తెలంగాణ సాధన లక్ష్యం నెరవేర్చిన కేసీఆర్ ఇప్పుడు కొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. సిద్దిపేటను దశంలోనే 100 శాతం క్యాష్ లెస్ లావాదేవీల నియోజకవర్గంగా చేయాలనేది ఆయన సంకల్పం. సిద్దిపేట అంటే కేసీఆర్ కంచుకోట. ప్రస్తుతం అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన మేనల్లుడు హరీష్ రావు కూడా ఈ లక్ష్య సాధనకు శ్రమిస్తున్నారు. కార్డు స్వైపింగ్ మిషన్లను ఉద్యమ స్థాయిలో సమకూర్చడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.
క్యాష్ లెస్ విధానం విషయంలో గ్రామాల మధ్య పోటీ పెంచడానికి కూడా గట్టి ప్రయత్నం జరుగుతోంది. 100 శాతం నగదు రహిత లావాదేవీలు సాధించిన తొలి గ్రామానికి 10 లక్షల రూపాయల నజరానా ఇస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఆ తర్వాతి స్థానంలో నిలిచే గ్రామానికి 5 లక్షల బహుమతి దక్కుతుంది. దీంతో ఈ విధానంపై ప్రజల్లో అవగాహనతో పాటు గ్రామాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందనేది ప్రభుత్వ ఉద్దేశం.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా క్యాష్ లెస్ లావాదేవీలపై బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. విభజన తర్వాత అనేక విషయాల్లో రెండు రాష్ట్రాల మధ్య పోటీ కనిపిస్తోంది. అభివృద్ధిలోనే కాదు, క్యాష్ లెస్ లావాదేవీలను ప్రోత్సహించడంలోనూ ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నారు. ఇందులో గెలుపు ఓటముల ప్రసక్తే లేదు. ప్రజల ఇబ్బందులు తీర్చడానికి ఇది ఒక మార్గం. మంచిదే.