ఎన్టీఆర్, పవన్‌లను మించిపోయాడు చరణ్. అయితే అది సినిమాల్లో హీరోయిజం చూపించడంలోనో లేక డ్యాన్సులు, ఫైట్లు చేయడంలోనో, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌ని కొల్లగొట్టడంలోనో కాదు…. అభిమానులను కాకా పట్టడంలో. మాటలతో అభిమానులను ఆనందపరిచే విషయంలో మాత్రం మిగతా హీరోలందరికంటే కూడా రామ్ చరణ్ ఓ మెట్టు పైకి ఎక్కేశాడు. నాయక్ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ‘వెంట్రుక’ అంటూ మాట్లాడి విమర్శిలపాలైన చరణ్ ‘ధృవ’ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్‌కి వచ్చేసరికి చాలానే మార్పు చూపించాడు. లుక్స్, డ్రెస్సింగ్ స్టైల్ అంతా కూడా నాయక్ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఉన్నట్టుగానే ఉన్నా బాడీలాంగ్వేజ్, మాటల విషయంలో మాత్రం… నేను చాలా మారిపోయాను అన్న క్లియర్ మెస్సేజ్ ఇవ్వడానికి అయితే చాలా చాలా ప్రయత్నించాడు చరణ్.
మన సినిమా హీరోలలో… ఎన్టీఆర్ అయితే ప్రతి ఒక్కరికి పేరు పేరునా పాదాభివందనం చేస్తూ ఉంటాడు. ఇక పవన్ గురించి చెప్పేదేముంది….అభిమాని అనే పదమే నాకు నచ్చదు, వాళ్ళు నా అభిమానులు కాదు, నా ఆత్మీయులు అని చెప్తాడు. ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు అని చెప్తాడు. ప్రతి ఒక్క అభిమానిని కౌగిలించుకోవాలని ఉందని తనదైన స్టైల్లో ఆడియో రిలీజ్ ఫంక్షన్స్‌లో మాట్లాడేస్తూ ఉంటాడు పవన్. ఇక ఇప్పుడు ధృవ ప్రి రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్, పవన్‌లను మించి అనే స్థాయిలో మాట్లాడేశాడు చరణ్. ‘పైన ఉన్న దేవుడు అయితే మాకు కనిపించడు కానీ కింద ఉన్న దేవుడైతే మీలానే ఉంటాడేమో…’..ఇదీ చరణ్ పేల్చిన డైలాగ్. ఎవరైనా రైటర్ చేత రాయించుకున్నాడో, లేక చరణే సొంతంగా ఆలోచించాడో తెలియదు కానీ డైలాగ్ అయితే మాత్రం అదిరిపోయింది. సినిమా సినిమాకు కలెక్షన్స్ రేంజ్‌ని పెంచుకుంటూ పోవాల్సిన రేసులో ఉన్న హీరోలకు ఇలాంటివి తప్పదు కూడానూ. నా సినిమాను చూడండి అని చెప్పడం కోసం రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కూడా నానా రకాల పబ్లిసిటీ పాట్లూ పడుతున్న ట్రెండ్ ఇది. అలాంటప్పుడు భారీ బడ్జెట్స్‌తో సినిమాలు తీసే చరణ్ లాంటి టాప్ రేంజ్ హీరోలకు ఈ ఫీట్లు తప్పవుగా.
అయితే అభిమానులకు మాత్రం సోషల్ యాక్టివిస్ట్స్ కొంతమంది ఎప్పటి నుంచో కొన్ని సలహాలు ఇస్తూ ఉన్నారు. హీరోలపైన అభిమానం సినిమాల వరకే పరిమితం చేయండి. వాళ్ళు స్టేజ్ పైన మాట్లాడే మాటలు నమ్మి ఆ హీరోల కోసం మీ జీవితాలను ఫణంగా పెట్టాలనే స్థాయిలో మూర్ఖంగా ఆలోచిస్తూ మిమ్మల్ని నిజంగా అభిమానిస్తున్నవాళ్ళను బాధపెట్టొద్దు.
నాయకులు, పార్టీలు, మతం, కులం, ప్రాంతం, హీరోల అభిమానులందరికీ చివరగా ఒక్క మాట. మనందరం కూడా మామూలుగానే గొప్ప నటులం. ఇక స్టేజ్ ఎక్కితే…ఇంకే రేంజ్లో నటిస్తాం. ముఖ్యంగా రాజకీయం, సినిమా రంగాల వరకూ చూసుకుంటే మాత్రం స్టేజ్ పైన ఎప్పుడూ కూడా నటనే ఎక్కువ కనిపిస్తుంది. అది నిజం అని భ్రమపడొద్దు. ఆ భ్రమలతో మీ బ్రతుకులు బలి చేసుకోవద్దు.