ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం విజయవాడలో తన క్యాంప్ ఆఫీసులో గనుల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, ఇసుక క్వారీలలో అక్రమాలు, అవినీతిని అరికట్టాలని, అందుకోసం అధికారులు కటినంగా వ్యవహరించాలని వారికి పూర్తి స్వేచ్చానిస్తున్నానని అన్నారు. అవసరమయితే పోలీసుల రక్షణ తీసుకొనయినా సరే ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆయన సూచించారు. ఇసుక క్వారీలలో అక్రమాలు అరికట్టేందుకు కటిన చర్యలు తీసుకోవడంతో బాటు, జి.పి.యస్, జియో ట్యాగింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అక్రమాలు అరికట్టే ప్రయత్నాలు చేయాలని అధికారులను ఆదేశించారు.
సరిగ్గా నెలరోజుల క్రితమే కృష్ణా జిల్లా ముసునూరు తహశిల్దార్ వనజాక్షి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అయన అనుచరులు ఇసుక అక్రమరవాణా చేయబోతుంటే అడ్డుకొన్నప్పుడు వారు ఆమెపై, ఆమె కూడా వచ్చిన ప్రభుత్వ సిబ్బందిపై దౌర్జన్యం చేసారు. దీనిపై ఆమె పోలీసులకి పిర్యాదు చేశారు. కానీ ఎమ్మెల్యే, అనుచరులపై వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళినప్పుడు ఆయన కూడా తన ఎమ్మెల్యేని వెనకేసుకొని వచ్చి, చివరికి ఆమెదే తప్పు అని తేల్చి చెప్పారు. ఆ తరువాత ఆమెను ఊరు వదిలి వెళ్లిపొమ్మని గుర్తు తెలియని వ్యక్తుల నుండి మెసేజులు కూడా వచ్చాయి. అవి ఎవరు పంపారో తేలికగానే ఊహించవచ్చును. కానీ అప్పుడూ ఆమెకు ఎవరూ అండగా నిలబడలేదు.
ఈ వ్యవహారంపై సాటి మహిళకు అన్యాయం జరిగిపోతోందని అరిచి గగ్గోలు చేసిన వైకాపా ఎమ్మెల్యే రోజా కూడా ఆ తరువాత ఆమెను పట్టించుకోలేదు. ఒక మహిళ అయినప్పటికీ తహసిల్దార్ వనజాక్షి చాలా దైర్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేని నిలువరించే ప్రయత్నం చేసారు. కానీ ఆమెకు ఎవరూ అండగా నిలబడలేదు. ఆమెపై దౌర్జన్యం చేసిన నిందితులకు నేటికీ ఎటువంటి శిక్ష పడలేదు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి అధికారులను ఇసుక అక్రమ రవాణాను అరికట్టమని, అక్రమాలకూ పాల్పడిన వారిపట్ల కటినంగా వ్యవహరించమని చెప్పి ఏమి ప్రయోజనం? అక్రమాలు అరికట్టలేనప్పుడు ఈ జి.పి.యస్ లు ఎందుకు? జియో ట్యాగులెందుకు?