పైసా ఖర్చు పెట్టకుండా కోట్లు విలువ చేసే పబ్లిసిటీని ఫ్రీలా చేయించుకోవడం ఎలాగో రాంగోపాల్ వర్మకు బాగా తెలుసు. తన సినిమా ఏదైనా సరే.. పబ్లిసిటీ బీబత్సంగా చేయించుకొంటాడు. కేవలం ట్విట్టర్లో కామెంట్లు, మైకు పట్టుకొని పేలే అవాకులు, చెవాకులూ… వర్మకి కావల్సినంత పబ్లిసిటీ చేసిపెడుతుంటాయి. అయితే తన తాజా చిత్రం `వంగవీటి` కోసం మాత్రం భారీగా ఓ ప్రమోషన్ ఈవెంట్‌ని ప్లాన్ చేశాడు రాంగోపాల్ వర్మ. `శివ టూ వంగవీటి` అంటూ ఈ ఈవెంట్‌కు నామకరణం చేశాడు. ఈ ప్రయాణంలో తాను పనిచేసిన లెజెండ్రీలతో ఓ వేడుక ఏర్పాటు చేశాడు. అమితాబ్ బచ్చన్ ని ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు వర్మ. ఈ పోగ్రాం కోసం దాదాపుగా కోటి రూపాయలు ఖర్చు పెట్టనున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఈరోజు రాత్రి హైదరాబాద్‌లోని జేఆర్సీ ఫంక్షన్ హాల్లో ఈవెంట్ కోసం అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయి. అమితాబ్ రావడమే ఆలస్యం అనుకొంటే… `బిగ్ బీ రావడం లేదు` అంటూ ఓ బాంబు పేలింది. అమితాబ్ కోసం వర్మ ఇంత గ్రాండ్‌గా ఈవెంట్ నిర్వహిస్తుంటే.. సడన్‌గా అమితాబ్ హ్యాండివ్వడం షాకిచ్చింది.
బిగ్బీకీ వర్మకీ ప్రత్యేకమైన రిలేషన్ ఉంది. సర్కార్ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలూ హిట్టయ్యాయి. ఇప్పుడు ఆ సిరీస్‌లో మూడో సినిమా తీస్తున్నాడు. అందుకే.. ఈ పోగ్రాంకి కచ్చితంగా అమితాబ్ వస్తాడని భావించారంతా. 6 గంటలకు రావాల్సిన అమితాబ్ 7 అయినా ఎక్కడా కనిపించకపోవడం ఆరా మొదలైంది. ‘అమితాబ్ ఫ్లయిట్ రెండు గంటలు ఆలస్యం. అందుకే ఆయన రావడం లేదు’ అంటూ మరో వార్త తెలిసింది. నిజంగానే అమితాబ్‌కు ఫ్లయిట్ మిస్సయ్యిందా, లేదంటే అమితాబ్ రాకపోవడానికి వేరే కారణాలున్నాయా అనేది తెలియరాలేదు. అన్నట్టు బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర అనారోగ్యంతో ఆసుపత్రి చేరారు. ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఆయన్ని పరామర్శించేందుకే బిగ్ బీ రాలేదేమో..??