ఇక్కడ ఎవరూ ఎవర్నీ తొక్కేయరు.. తొక్క బడరు అంటూ రొటన్ స్టేట్ మెంట్లు ఇస్తుంటారు సినిమా వాళ్లు. అవి విని ‘నిజంగా అది నిజమే ఏమో’ అనుకొంటాం. కానీ సరిగ్గా అలాంటి డైలాగులు చెప్పేటప్పుడే వాళ్లు అరివీరభయంకరంగా నటించేస్తారన్న నిజాన్ని మాత్రం గ్రహించలేం. ఇక్కడ తొక్కేయడం అరటి పండు తొక్క తీసి, పండు మింగేయడం అనేంత ఈజీ అయిపోయింది. కాస్త పలుకుపడి, ఇంకాస్త క్రేజ్, చేతిలో రెండు హిట్లు ఉంటే చాలు, అంతకంటే తక్కువ రేంజు ఉన్నవాళ్లని తొక్కేసి, వాళ్ల జీవితాలతో తొక్కుడు బిళ్ల ఆట ఆడేయొచ్చు. పరిశ్రమలో అదే జరుగుతుంటుంది. యువ కథానాయిక అవికాగోర్ విషయంలోనూ ఇదే జరిగింది. ఒకట్రెండు సినిమాలతోనే సౌందర్య నుంచి నిత్యమీనన్ వరకూ చాలామందితో పోల్చారు ఈ కథానాయికని. ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మావ సినిమాలు చూస్తే.. కచ్చితంగా యేడాదికి ఆరేడు సినిమాలు చేసేసే కెపాసిటీ ఉందీ ఈ అమ్మడికి అనిపించింది. అయితే అవికా కెరీర్.. సడన్ డ్రాప్ అయ్యింది. ఆమాటకొస్తే తన చేతిలో సినిమానే లేదిప్పుడు. దానికి కారణం.. ఆమెకు అవకాశాలు రాక కాదట. వచ్చిన అవకాశాల్ని కొంతమంది అడ్డుకొంటున్నార్ట. అవిక ఎందుకు దండగ?? ఇంకో హీరోయిన్ ఉండగా.. అంటూ అడ్డు పడుతున్నార్ట.
ఓ బ్యాచ్ అవికాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, అవికాకు వస్తున్న అవకాశాల్ని దూరం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈమధ్య అవికా ఓ యువ హీరోతో గొడవ పెట్టుకొంది. ఆ గొడవతోనే హీరోలు రెండు వర్గాలుగా విడిపోయారు. అవికాని సపోర్ట్ చేసినవాళ్లు కొంతమంది, అవికాకి నెగిటీవ్‌గా కొంతమంది విడిపోయారు. సపోర్ట్ చేసిన వాళ్లంతా ఇప్పుడు సెలైంట్ అయిపోతే, నెగిటీవ్ అయినవాళ్లు మాత్రం సైలెంట్‌గా తమ పనికానిచ్చేస్తున్నార్ట. ‘అవికాని తీసుకొంటే మేం పనిచేయం’ అంటూ బ్లాక్ మెయిల్‌కి దిగుతున్నార్ట. అవిక యువ హీరోల పక్కనే సెట్ అవుతుంది. వాళ్లే రెండు గ్రూపులుగా విడిపోవడం.. అందులో కొంతమంది నెగిటీవ్ ప్రచారం చేయడంతో దర్శక నిర్మాతలు కూడా అవికాని దూరం పెట్టాల్సివస్తోందట. ఈగోలంతా భరించలేను అనుకొని తనకొచ్చిన కొన్ని తెలుగు సినిమాల్నీ అవిక వదులుకొందని చెబుతున్నారు. ”అవిక ఈమధ్య కొన్ని సినిమాల్ని వదులుకొన్న మాట నిజమే. అయితే.. దానికి కారణం మీరనుకొంటున్నదేదీ కాదు. అవిక వ్యక్తిగత కారణాల వల్ల సినిమాల్ని తగ్గించుకొంది” అని అవిక సన్నిహితులు చెబుతున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అవికానే నోరు విప్పాలి.