గతంలో పోల్చుకుంటే ప్రతిపక్ష పార్టీ వైకాపాలో ఈ మధ్య కాస్త ఊపు కనిపిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బతో కొంతమంది ఎమ్మెల్యేలు దూరం కావడం, ప్రజా సమస్యల పట్ల కాస్త ఆలస్యంగా స్పందిస్తుండటం వంటి కారణాలతో పార్టీ శ్రేణుల్లో ఒకింత నిరుత్సాహ వాతావరణమే ఉండేది. అయితే, ఈ మధ్య కొంతమంది నేతలు వైకాపాలోకి చేరడంతో నయా జోష్ పెరిగింది. పైగా, ఎన్నికలు ఇప్పటికిప్పుడే ముంచుకొచ్చేస్తున్నట్టుగా పార్టీలో ఒక హడావుడి వాతావరణాన్ని జగన్ తీసుకొచ్చారు. ఏదో ధీమాతో తమ అధినేత దూసుకుపోతున్నారనే భావన పార్టీ వర్గాల్లో కల్పించారు. మధ్యంతరం వస్తుందన్న ఆశ వైకాపా వర్గాల్లో కాస్త బలంగానే ఉన్నట్టుంది. నోట్ల రద్దు అంశంపైగానీ, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలోగానీ కేంద్రంతో తలపడుతున్నారు. సో… పైపైకి అంతా బాగుపడుతోందన్న ఒకస్థాయి నమ్మకాన్ని పార్టీ వర్గాల్లో తీసుకురాగలిగారు. కానీ, పార్టీ పునాదులను దృఢంగా చేసే ప్రయత్నాలు మాత్రం ఇంకా ఆరంభం కావడం లేదని చెప్పాలి.
ఎంత గొప్ప చరిత్రగల పార్టీకైనా కార్యకర్తలే బలం. ఆ బలగాన్ని పెంచుకోవడం కోసం నిత్యం ఆరాటపడుతూ ఉండాలి. ఆ విషయంలో అధికార పార్టీ తెలుగుదేశం నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని అనడంలో సందేహం లేదు. ఫిరాయింపుల పేరుతో ఎంతమంది నాయకుల సంఖ్యను పెంచుకుంటూ ఉన్నా… దాంతోపాటు, కార్యకర్తల సంఖ్యను కూడా క్షేత్రస్థాయిలో పెంచుకుంటోంది. కానీ, వైకాపా ఇప్పటికిప్పుడు నాయకుల సంఖ్యను పెంచుకోవడంపైనే ఎక్కువ దృష్టిపెడుతోందని అనిపిస్తోంది. తెలుగుదేశంతోపాటు, ఇతర పార్టీల నేతలకు కూడా వలలు వేస్తోంది. ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల్లో బరిలో దిగే అభ్యర్థులను కూడా ఎంపిక చేసేంత హడావుడి పార్టీలో కొనసాగుతోంది.
పార్టీలోకి కొత్తవారు చేరడం తప్పుకాదు. సామర్థ్యమున్న నాయకులు అవసరమే. కానీ, దాంతోపాటు కిందిస్థాయిలో పార్టీ కార్యకర్తల్ని కూడా పెంచుకోవాలి కదా! అభిమానులందరూ కార్యకర్తలే, జగన్ సభకు వచ్చి చప్పట్లు కొడుతున్నవారంతా రేపొద్దున్న ఎన్నికల్లో ఓటు వేస్తారనే లెక్కలు వేసుకుంటే మొదటికే మోసం అవుతుంది. పార్టీ బలోపేతంలో ప్రధానమైన అంకం సభ్యత్వ నమోదు కార్యక్రమం. వైకాపా ఇంతవరకూ ఆ ఊసే ఎత్తడం లేదు. దాని గురించి అధినేత జగన్ కూడా కాస్త లైట్‌గానే తీసుకుంటున్నారట. వచ్చే ఏడాది దాని గురించి ఆలోచించవచ్చులే అనే ధోరణిలో ఉన్నట్టుగా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏ రాజకీయ పార్టీకైనా పునాదులు అంటేనే సభ్యత్వాల సంఖ్య. మరి, ఈ దిశగా ఎందుకింత తాత్సారం చేస్తున్నారో వారికే తెలియాలి. ఇప్పటికే నమోదు ఆలస్యమైంది. ఇప్పటికైనా, దాని ప్రాధాన్యత గుర్తిస్తే పార్టీ పునాదులు బలపడతాయి.