అనుకున్నంతా అయింది..! బ్యాంకు ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత చాలామంది బ్యాంకు ఉద్యోగులు తీవ్ర ఒత్తిళ్ల మధ్య పనిచేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. బ్యాంకుల ముందు వందల సంఖ్యలో బారులు తీరి ఉన్న ఖాతాదారులకు సరిపడా సొమ్ము ఇవ్వలేక అవస్థలు పడుతున్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తరువాత ఒక్కో ఖాతాదారుడూ వారానికి రూ. 24 వేలు విత్డ్రా చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించేసింది. కానీ, ఆ మేరకు నగదు ఖతాదారులందరికీ ఇవ్వాలంటే సరిపడా సొమ్ము ఆర్బీఐ తమకు పంపడం లేదని బ్యాంకు అధికారులు అంటున్నారు. రోజంతా బ్యాంకుల ముందు నిలబడ్డా కూడా సొమ్ము దొరకనివారు ఉద్యోగులపై మండిపడుతున్నారు. చాలాచోట్ల దాడులకు దిగిన ఉదంతాలను మనం విన్నాం. అయితే, ఇన్ని ఒత్తిళ్ల మధ్య పనిచేయాలంటే కరెన్సీ నోట్ల ఫ్లో పెంచాల్సిందే అని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోతూ ఉండటంతో ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమౌతున్నారు.
ఈ నెల 28న ఆందోళన నిర్వహిస్తున్నట్టుగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు నేతలు ప్రకటించారు. నోట్ల రద్దు నేపథ్యంలో తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామనీ, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆ సంఘాల నాయకులు ఈ సందర్భంగా విమర్శించారు. 28న ఆందోళన తరువాత, ఆ మర్నాడు కేంద్ర ఆర్థికమంత్రిని కలిసి వినతి పత్రం ఇస్తామనీ, ఆ తరువాత జనవరి రెండు మూడు తారీఖుల్లో కూడా ఆందోళన కొనసాగుతుందని ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకటాచలం అన్నారు. బ్యాంకులకు అవసరమౌతున్న సొమ్మును అందించడంలో రిజర్వ్ బ్యాంకు పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. నగదు లేని బ్రాంచ్లను కొన్నాళ్లపాటు మూసేయాలంటూ సూచించారు.
తీవ్ర ఒత్తిళ్ల మధ్య పనిచేస్తున్న బ్యాంకు ఉద్యోగులు ఇలాంటి నిర్ణయమేదో తీసుకునే అవకాశం ఉందన్న అంచనాలు గతవారంలోనే వినిపించాయి. బ్యాంకులు పనిచేస్తుంటేనే ప్రజలకు సొమ్ము అందడం లేదు. 80 శాతానికి పైగా ఏటీఎమ్లు ఎలాగూ పనికిరాని డబ్బాలు అయిపోయాయి! ఇప్పుడు ఆందోళన పేరుతో బ్యాంకు ఉద్యోగులు కూడా రోడ్ల మీదికి వస్తే, సామాన్యుడి పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారౌతుంది. మూలుగుతున్న నక్కమీద తాటి పండు పడినట్టుగా పరిస్థితి మారుతుంది. రోజంతా క్యూలో నిలబడితే వారానికి ఓ రెండు మూడు వేల రూపాయలైనా దొరుకుతాయన్న ఆశతోనే సామాన్యులు రోజులు వెళ్లదీస్తున్నారు. నెలాఖరు సమయంలో బ్యాంకు ఉద్యోగులు ఆందోళనకు దిగితే పరిస్థితి మరింత ఇబ్బందిగా పరిణమిస్తుందనడంలో సందేహం లేదు.