రాంగోపాల్ ఓ ఎత్తు వేసే ముందు.. ప్రత్యర్థి వేయబోయే పది ఎత్తుల్ని ముందే ఆలోచించగల సమర్థుడు. ఏం చేసినా ఓ లాజిక్కు.. మేజిక్కూ ఉంటాయి. చాలా యేళ్ల తరవాత… తన సినిమా ప్రమోషన్ని భారీ ఎత్తున చేయడానికి సంకల్పించాడు. ‘వంగవీటి’ని జనం ముందుకు తీసుకెళ్లాలంటే, ఆకర్షించే ప్రాజెక్టుగా చేయాలంటే డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే అనే నిర్ణయానికి వచ్చి.. ‘శివ టూ వంగవీటి’ అంటూ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఎప్పుడూ ప్రచారం కోసం జేబులోంచి పైసా కూడా తీయని వర్మ ఇంత సాహసం చేస్తున్నాడేంటి? అనిపించింది. అయితే.. వర్మ ఎత్తుగడ ఫలించింది. తాను అనుకొన్న లక్ష్యం వర్మ సాధించగలిగాడు.
వర్మ లక్ష్యం నెంబర్ వన్…. ‘తెలుగులో మీరు సినిమాలు చేయాల్సిందే’ అంటూ టాలీవుడ్ ఇండ్రస్ట్రీనే బతిమాలాడడం. అందులో వర్మ గ్రాండ్గా సక్సెస్ అయ్యాడు. ‘నా చివరి సినిమా వంగవీటినే`’అని ప్రకటించాడు వర్మ. `వంగవీటి`తో వర్మ కనిపించాడన్న టాక్ బాగా తీసుకొచ్చాడు. మళ్లీ ఇప్పుడు వర్మ తెలుగులో సినిమా తీశాడనుకోండి. ఇక భవిష్యత్తులో ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చే అవకాశం ఉండదు. అందుకే తెలుగు దర్శకులు, నిర్మాతల చేతే.. `మీరు తెలుగు ఇండస్ట్రీ వదిలి పెట్టడానికి వీల్లేదు` అనిపించేలా చేశాడు. గుణశేఖర్ లాంటి దర్శకులైతే.. ‘సినిమా తీయకపోతే.. నీ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తాం’ అనేశారు. బి.గోపాల్ అయితే ‘చైన్లు పట్టుకొని నీ వెంట తిరుగుతాం’ అని బెదిరించారు. వర్మకు ఇంకేం కావాలి? ఎంచకా… తాను మళ్లీ మనకు బోర్ కొట్టేంతలోపు ఓ పాతిక సినిమాలు తీసి పడేస్తాడు.
లక్ష్యం నెంబర్ టూ.. నాగార్జున కళ్లల్లో పడడం. కార్యక్రమం అంతా `శివ` జపంలా సాగింది. మైకు పట్టుకొన్నవాళ్లు పట్టుకొన్నట్టు ఉండక అటు వర్మనీ, ఇటు వర్మకి అవకాశం ఇచ్చిన నాగ్నీ, ఆ శివ సినిమాని పొగుడుతూనే ఉన్నారు. వర్మ ఉన్నాడంటే కారణం నాగార్జునే.. అనేశారు. దాంతో నాగ్ భుజాలు గజాలైపోయి ఉంటాయి. తాను కూడా మైకు పట్టుకొని ”శివ 2 తీస్తానని చాలామంది అడిగారు. కానీ శివ 2 చేస్తే నువ్వే చేయాలి.. లేకపోతే ఆ సినిమా ముట్టుకోను” అంటూ శపథం చేశాడు. ఇది చాలదూ.. వర్మ విజృంభించేయడానికి. నాగ్ మాటతో ‘శివ 2’కి ద్వారాలు తెరిచిపోయాయి. వర్మ ఇచ్చిన మాటమీద నిలబడే రకం కాదు గానీ, నాగ్ మాత్రం నిలబడి తీరతాడు. పైగా ‘శివ 2’ అంటే ఆ క్రేజే వేరుగాఉంటుంది. సినిమా ఎలాగున్నా డబ్బులు గిట్టుబాటు అయిపోవడం ఖాయం. సో.. వర్మ దృష్టిలో ఈ పోగ్రాం గ్రాండ్ సక్సెస్. తాను అనుకొన్నది సాధించేశాడు. దాంతో పాటు వంగవీటి ప్రమోషన్లూ దక్కించుకొన్నాడు. దటీజ్ వర్మ…!