వరుస ఫ్లాపుల మధ్య ధృవ చరణ్‌కి ఉపశమనం కలిగించిన మాట వాస్తవం. ఆహా ఓహో సినిమా కాకపోయినా.. ఓ మంచి సబ్జెక్ట్‌ని పాడు చేయకుండా తీశారన్న పేరైతే వచ్చేసింది. చరణ్ పడిన కష్టాన్ని కూడా అంతా గుర్తించారు. అయితే.. రామ్ చరణ్ మాత్రం ఈ రిజల్ట్ పట్ల హ్యాపీగా లేడని తెలుస్తోంది. కనీసం రూ.50 కోట్ల క్లబ్లో ఈ సినిమా ఈజీగా చేరుతుందని లెక్కవేశాడు చరణ్. ఇప్పటి వరకూ లెక్కల్ని తిరగేస్తే ఈ సినిమా రూ.40 కోట్లు దాటడం గగనం అయిపోయింది. `ధృవకి హిట్ టాక్ వస్తే రూ.60 కోట్లు రావడం ఖాయం` అంటూ ముందుగా వేసుకొన్న లెక్కలు ఇప్పుడు తల్లకిందులయ్యాయి. హిట్ అయినా… రూ.50 కోట్లు సాధించలేకపోయామన్న అసంతృప్తి చరణ్‌లో నెలకొన్నట్టు మెగా కాంపౌండ్ వర్గాలే చెబుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ధృవ సినిమాపై పడిందని, అందుకే.. అనుకొన్న లక్ష్యం సాధించలేకపోయామని అల్లు అరవింద్ చరణ్‌కి సర్ది చెబుతున్నాడట.
నిజానికి దసరా బరిలో ఈ సినిమా నిలవాల్సింది. అన్నీ అనుకొన్నట్టు జరిగితే దసరాకే ఈ సినిమా వచ్చేయాల్సింది. కానీ.. షూటింగ్ ఆలస్యమవ్వడం వల్ల ప్రణాళికా బద్దంగా సాగకపోవడం వల్ల.. అనుకొన్న సమయం కంటే చాలా ఆలస్యంగా రావాల్సివచ్చింది. ఆ ప్రభావం కూడా… ధృవ పై పడింది. దసరాకే వచ్చేసుంటే, ఈ టాక్‌కి, అప్పటి పరిస్థితులకు కచ్చితంగా రూ.60 కోట్లు కొట్టేద్దును. ఈ ఆలస్యం ఖరీదు.. రూ.20 కోట్లన్నమాట.