చాలారోజుల తరువాత భాజపా నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి ఈ మధ్య తరచూ వార్తల్లోకి వస్తున్నారు. నిజానికి, ఆయన భాజపాలో ఉన్నది నామ్ కే వాస్తే మాత్రమే. ఆ పార్టీ తరఫున ఆయన ప్రముఖంగా చేసిందేమీ లేదు. ఆయన చేస్తున్న పోరాటాలన్నీ ఒంటరి పోరాటాలే అని చెప్పాలి. తెలంగాణలో కేసీఆర్ సర్కారు చేపడుతున్న ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని ఆయన ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఈ మధ్య తన పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు నాగం జనార్థన్ రెడ్డి. దీంతో ఆయన యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు! నాగం రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి మరో రెండు మూడు నెలల్లో ఒక స్పష్టత రావొచ్చంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిజానికి, తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన నాయకుల్లో నాగం జనార్థన్ రెడ్డి ఒకరు. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో నాగం కీలక పాత్ర పోషించారు. చంద్రబాబుకు ఆయన ఎంతో నమ్మకస్థుడిగా ఉండేవారు. అయితే, తరువాత చోటు చేసుకున్న వివిధ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి నాగం దూరమయ్యారు. భాజపాలో చేరారు. కానీ, అక్కడ కూడా ఆయన ఇమడలేకపోయారు. ఆ పార్టీకి దూరంగానే ఉంటూనే అధికార పార్టీ తెరాసపై ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే భాజపాతో సంబంధం లేకుండా తన సొంత అజెండాతో ముందుకు సాగుతున్నారు. అయితే, కొన్నాళ్లపాటు సైలెంట్‌గా ఉంటూ వచ్చిన నాగం, ఈ మధ్య కాస్త యాక్టివ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేలా… ఈ మధ్యనే ఆయన తెలుగుదేశం కార్యాలయానికి రావడం, రేవంత్ రెడ్డితో సహా పలువురు నాయకుల్ని కూడా కలుసుకున్నారు. సో… దీంతో నాగం ఇటువైపు మొగ్గు చూపుతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. పైగా, తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కూడా బలమైన నాయకుల అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే చాలామంది నేతలు పార్టీని వదిలి వెళ్లిపోయారు. ఇలాంటి తరుణంలో నాగం లాంటి అనుభవజ్ఞుడు మళ్లీ టీడీపీలోకి వస్తే బాగుంటుందనే అభిప్రాయం కొంతమంది టి. దేశం నేతల్లో ఉంది. ఆయన వెనక్కి వస్తానంటే వద్దనడానికి కూడా చంద్రబాబు దగ్గర బలమైన కారణాలు లేవని అంటున్నారు. సో.. దీంతో నాగం రాజకీయ భవిష్యత్తుపై తాజాగా ఈ చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల్లో దీనిపై ఓ క్లారిటీ రావడం ఖాయమని చెప్పొచ్చు.