హైదరాబాద్: అక్కినేని ఫ్యామిలీ ఇవాళ రికార్డ్ సృష్టిస్తోంది. ఫ్యామిలీలోని ముగ్గురు హీరోలూ – నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ – ప్రస్తుతం నటిస్తున్న వారి వారి తాజా చిత్రాల ప్రోమోలు మూడూ ఇవాళ రిలీజ్ అవుతున్నాయి. తండ్రి, ఇద్దరు కొడుకుల చిత్రాల ప్రోమోలు ఇలా ఒకే రోజు రిలీజ్ అవ్వటం భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఒక అరుదైన రికార్డ్ అని చెప్పుకోవాలి. నూతన దర్శకుడు కళ్యాణకృష్ణ దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయన’, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’, వినాయక దర్శకత్వంలో నితిన్ నిర్మిస్తున్న ‘అఖిల్’ ప్రోమోలు ఇవాళ విడుదలవుతున్నాయి.
ఇంతకన్నా మంచి బర్త్‌డే ట్రీట్ తనకు మరేమీ లేదని నాగార్జున అంటున్నారు. ప్రస్తుతం ఆయన ఫారెన్‌లో ఉన్నారు. వరస చిత్రాలతో బిజీగా ఉన్నట్లు చెప్పారు. సోగ్గాడే చిన్ని నాయన సెప్టెంబర్ 20కి, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సినిమా అక్టోబర్‌కు పూర్తవుతాయని తెలిపారు. తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఒక భక్తి సినిమా, ఈ లోపుగా ఒక యాక్షన్ సినిమా చేస్తానని చెప్పారు. మరో రెండు నెలల్లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కొత్త సీజన్ ప్రారంభమవుతుందని, ఇవి కాకుండా ఒక పౌరాణికం, జేమ్స్‌బాండ్ తరహాలో ఒక యాక్షన్ సినిమా చేయాలనుందని చెప్పారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా అంతా కొత్తవారితో ఒక సినిమా నిర్మిస్తున్నట్లు, సైజ్ జీరో చిత్రంలో గెస్ట్ రోల్ చేయనున్నట్లు నాగ్ వెల్లడించారు. మరోవైపు అఖిల్ చిత్రం టీజర్‌ను బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇవాళ సాయంత్రం రిలీజ్ చేస్తున్నారు.