అవకాశాలు రానంత వరకూ పడిగాపులు గాయడం.. కాస్త బిజీ అయ్యాక చేతికందిన సినిమాల్ని వదులుకోవడం, కెరీర్ నిర్లక్ష్యం చేయడం… ఇవన్నీ కథానాయికల జీవితాల్లో జరుగుతూనే ఉంటాయి. ఇలియానాని చూడండి. స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తన సుడి అప్పట్లో మామూలుగా తిరిగిందా? కో అంటే కోటి ఇచ్చి.. కొండమీద కోతినైనా తీసుకొచ్చి దించేవారు. అందరికీ ఇల్లూబేబీనే కావాలి. కానీ ఇలియానా మూడ్ మాత్రం ఇటు ఉండేది కాదు. తెలుగు సినిమాల్ని తెగ ఉద్ధరించేశాం.. ఇక బాలీవుడ్ భరతం పడదాం అనే మైండ్ సెట్లో ఉండేది. సినిమాలు చేసీ, చేసీ విసిగిపోయా.. నాకు బ్రేక్ కావాలి.. అని కొంతకాలం సినిమాలేం చేయకుండా దూరంగా ఉండేది. ఇప్పుడు చూడండి అమ్మడి పరిస్థితి. అవకాశం ఇచ్చేవాడే కరవయ్యాడు. ఇలియానా పేరు ఓ సినిమా కాస్టింగ్ జాబితాలోనో, పుకార్లలోనో, చర్చలలోనే, కనీసం దర్శకుడి ఉహల్లోనో మెదిలి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు సమంత పరిస్థితీ అంతేనేమో అని జాలేస్తోంది.
టాలీవుడ్లో సమంత తిరుగులేని హీరోయిన్. ఎన్ని హిట్లున్నాయి అనేది పక్కన పెడితే సమంతని తీసుకోవడం సినిమాకి అదనపు ఆకర్షణ అని దర్శక నిర్మాతలు నమ్మేవారు. తను కూడా అంతే. ఎంత పద్ధతిగా కనిపించేదో, అవసరమైన చోట.. అంతే గ్లామర్ కురిపించేది. కోట్లుస్తున్నాయి కదా, సొమ్ములు చేసుకొందామన్న ఉద్దేశంతో స్టార్ హీరోల సరసన సటిస్తున్న సమయంలోనే బెల్లంకొండ శ్రీనివాస్‌తో కూడా జోడీ కట్టగలిగింది. ఈ స్టార్ డమ్ ఎంత కాలం ఉంటుందో తెలీదు కాబట్టి.. సమంత అలా దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం కూడా ఎవ్వరూ తప్పుబట్టలేకపోయారు. అంత జోరు చూపించిన సమంతకు ఇప్పుడేమైంది? తన దగ్గరకు వస్తున్న సినిమాల్ని ఎందుకు కాలదన్నుకొంటోంది? మరీ ఇంత బద్దకిస్ట్లా ఎందుకు మారిపోయింది..? ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలు. జనతా గ్యారేజ్ తరవాత సమంత సినిమాల్ని ఒప్పుకోలేదు. చైతూ తో పెళ్లి ఫిక్సయ్యాక సమంత మూడ్ మొత్తం మారిపోయింది. అలాగని పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉంటానని ఏమీ చెప్పడం లేదు. దేని దారి దానిదే అన్నట్టు మాట్లాడుతుంది. అలాంటప్పుడు సినిమాల్ని ఎందుకు వదులుకొంటోంది.? సమంత పరిస్థితి చూస్తుంటే.. `కొంతకాలం నాకెవ్వరూ కథలు చెప్పొద్దు` అన్నట్టుగా తయారైందని దర్శక నిర్మాతలు గుసగుసలాడుకొంటున్నారు.
జనతా గ్యారేజ్ తరవాత కనీసం ఓ అరడజను ఆఫర్లు వచ్చాయి. కానీ దేన్నీ ఒప్పుకోలేదు సమంత. కొంతకాలం సినిమాలకూ, ఇక్కడి వాతావరణానికీ దూరంగా ఉండాలనుకొందా అంటే అదీ లేదు. అవన్నీ యధావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. టాలీవుడ్లో కథానాయికల పరిస్థితి ఇదివరకటిలా లేదు. స్టార్లకు పోటీగా కొత్తవాళ్లు దూసుకొస్తున్నారు. కీర్తి సురేష్ లాంటి కథానాయికలు ఒక్క సినిమాతోనే సంచలనాలు సృష్టిస్తున్నారు. అలాంటప్పుడు కెరీర్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాగని సమంత ఏమీ అద్భుతమైన అందగత్తె కాదు. తానో యావరేజ్ అమ్మాయినని తాను కూడా చాలా సందర్భాల్లో ఒప్పుకొంది. సినిమాలకు దూరం కాను, ఇక్కడే ఉంటా అనుకొన్నప్పడు తన దగ్గరకు వస్తున్న అవకాశాల విషయంలో మరీ ఇంత నిర్లక్ష్యపు ధోరణి పనికిరాదు. అది చిత్రసీమకు తప్పుడు సంకేతాల్ని అందిస్తుంది.
సమంత మనం అడిగినప్పుడు కాదంది.. ఇప్పుడు మనం అవకాశం ఇవ్వొద్దు.. అని ఈగో ఫీలింగ్‌కి పోతే.. సమంత చేజార్చుకొన్న ప్రతీ సినిమా ఆమె కెరీర్‌కి అడ్డుపడే ప్రమాదం ఉంది. సమంతకు ఇప్పుడు కావల్సింది గైడెన్స్. ఏం చేయాలో, ఏం చేయకూడదో.. తనకు కాస్త చెప్పగలిగే తోడు. బహుశా… అది చైతూనే చేయగలడేమో..? తెలుగు సినిమాల్లోనే కొనసాగాలి అనుకొంటే… తనకొస్తున్న అవకాశాల్ని చిన్నచూపు చూడ కూడదు. లేదూ.. అక్కినేని సమంతగా ఇంటి పట్టునే ఉండిపోదాం అనుకొంటే.. ‘నో’.. ‘నో’ అంటూ నోరు నొప్పట్టేదాకా నిరభ్యంతరంగా చెప్పేయొచ్చు. మరి సమంత మనసులో ఏముందో..?