రెండు గ్రామాలు, 488 ఇండ్లు. సామూహిక గృహ ప్రవేశం. పండుగ వాతావరణం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్న పేటల్లో సామూహిక గృహప్రవేశాలకు శుక్రవారమే సుముహూర్తం. 600 మంది బ్రాహ్మణుల వేద మంత్రాల మధ్య 488 కుటుంబాలు గృహప్రవేశం చేయనున్నాయి. ఈ సందర్భంగా ఎర్రవల్లి వెళ్లే కేసీఆర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలకడానికి రుత్విక్కులు సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఇంట్లో పుణ్యవచనం, సత్యనారాయణ వ్రతం ద్వారా గృహప్రవేశం చేస్తారు.
కేసీఆర్ దత్తత గ్రామంలో ఒక్కో డబుల్ బెడ్ రూం గృహ నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల 40 వేల రూపాయలకు ఖర్చు చేసింది. అలాగే ప్రతి ఇంటికి ఒక గేదెను, 10 కోళ్లను, 5 మొక్కలను కూడా ప్రభుత్వం ఇస్తుంది. పేదకు అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లకు బదులు డబుల్ బెడ్ రూం పక్కా ఇళ్లను నిర్మించి ఇస్తామనేది కేసీఆర్ చిరకాల వాగ్దానం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ ఆయన ఇదే మాట చెప్తున్నారు. ఆ మేరకు సికింద్రాబాద్ లో ఓ భవన సముదాయాన్ని నిర్మించారు. ఆ తర్వాత డబుల్ బెడ్ రూం ఇళ్ల ఊసే లేదు.
వరంగల్ లోని మురికి వాడల వారికి ఇచ్చిన హామీ ఇంత వరకూ నెరవేర లేదు. ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఈ ఏడాది వేసవిలోనే గృహ ప్రవేశాలు జరిగి ఉండాల్సింది. కానీ ఇంత వరకూ ముగ్గు కూడా పోయలేదు. అలాగే హుస్నాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామంటూ కొందరి పూరిళ్లను కూల్చారు. ఇంత వరకు కొత్త ఇళ్లను నిర్మించలేదు. దీంతో ఆ కుటుంబాల వారు టెంట్లలో నివసిస్తున్నారు. ఎండా, వాన, చలికి ఇబ్బందులు పడుతున్నారు.
కనీసం తన దత్తత గ్రామాల్లోనూ అయినా ఇళ్లను నిర్మించాలని కేసీఆర్ భావించారు. ఆ మేరకు ఎట్టకేలకు నిర్మాణం పూర్తయింది. మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదలకు డబుల్ బెడ్ రూపం ఇళ్ల నిర్మాణం ఎప్పుడనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.