కానిస్టేబుల్ గా క్యాప్ పెట్టిన పోలీస్…. హెడ్ కానిస్టేబుల్‌గా, ఎస్సైగా, సీఐగా ప్రమోషన్ తెచ్చుకొంటాడో లేదోగానీ, కమెడియన్పోస్టుకు వచ్చిన ప్రతీ ఒక్కడూ… హీరో చైర్ పై గురి ఎక్కుపెడతాడు. హీరోలు కామెడీ చేయగా లేనిది… కమెడియన్లు హీరోయిజం ఒలికించకూడదా?? అన్నది కమెడియన్ల పాయింటు కావొచ్చు. అయినా మన హీరో గీరో ఎవరూ జాన్తానై. సినిమా బాగుంటే ఎవడైనా చల్తా. తమిళ హీరోలు ధనుష్, విశాల్, విజయ్ ఆంటోనీ ఏమైనా అందగాళ్లా? వాళ్లది హీరో ఫేసా? సినిమాలు బాగుంటే చూడడం లేదా? అదే లెక్క ఇక్కడా వర్తిస్తుంది. కాకపోతే.. హీరోలుగా రెచ్చిపోవాలని చూస్తున్న కామెడీ స్టార్లు.. కామెడీ తప్ప అన్నీ చేద్దామని చూస్తూ.. అక్కడే చేతులు, కాళ్లూ కాల్చేసుకొంటున్నారు. మరిప్పుడు సప్తగిరి పరిస్థితి ఏంటి?? యేడాదికి పాతిక సినిమాలు, రోజుకి రెండు కాల్షీట్లతో బిజీగా ఉండే సప్తగిరికి హీరోగా మారాల్సిన అవసరం లేదిప్పుడు. కానీ.. ‘హీరో’ అనిపించుకోవాలన్న ఆశో, తనలోని టాలెంట్ మొత్తం ఉతికి ఆరేసి ఫ్రెష్షుగా చూపించాలన్న కసో.. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ని పట్టాలెక్కించేలా చేసింది. మరి ఈ ఎక్స్‌ప్రెస్ స్పీడెంత? ఏ స్టేషన్లో ఆగింది? గమ్యం చేరిందా, లేదా? ఈ డౌట్లు తీర్చుకొందాం.. రండి.
* కథ
సప్తగిరి (సప్తగిరి)కి నాటకాలంటే పిచ్చి. సినిమా నటుడవ్వాలన్నది కల. నాన్న ప్రసాద్ (శివ ప్రసాద్) ఓ కానిస్టేబుల్. తన కొడుకుని పెద్ద పోలీస్ ఆఫీసర్‌గా చూడాలనుకొంటాడు. కానీ.. తండ్రి ఆశ, ఆశయం ఏమాత్రం చెవికెక్కవు. ఆ కాలనీకి వచ్చిన పూర్ణిమ (రోషిణి) వెంట పడుతూ, డీఎస్పీ (పోసాని) కొడుకుని చితగ్గొడుతూ, కానిస్టేబుల్ ఫ్రెండ్ (షకలక శంకర్)తో కాలక్షేపం చేస్తూ గడిపేస్తుంటాడు. అయితే సడన్‌గా తన తండ్రి ఓ ఎన్కౌంటర్లో చనిపోతాడు. ఆ ఉద్యోగం… సప్తగిరికి వస్తుంది. కేవలం తండ్రి కోరికని, ఆశయాన్నీ దృష్టిలో ఉంచుకొని కానిస్టేబుల్‌గా మారతాడు. ఓరోజు ఎన్కౌంటర్ వల్ల తన తండ్రి మరణించలేదని, దాని వెనుక ఓ బలమైన కారణం ఉందని, అది హత్య అని గ్రహిస్తాడు. మరి తండ్రిని చంపిన హంతకులు ఎవరు? వాళ్లపై సప్తగిరి ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు? అనేదే కథ.
* తెలుగు 360 విశ్లేషణ
ఓ కమెడియన్ని హీరోగా చేస్తున్నప్పుడు ఎంచుకోవాల్సిన కథ కాదిది. తండ్రి హత్య.. దాని మిస్టరీ.. ప్రతీకారాలు – ఇదంతా మాస్ హీరోల ఫార్ములా. అయితే దర్శకుడు కాస్త తెలివిగా టాకిల్ చేశాడు. హీరోకి సినిమాలు, నాటకాలంటే పిచ్చి. దాని చుట్టూ కొన్ని కామెడీ సీన్లు అల్లుకోవడానికి ఛాన్స్ దొరికింది. కాలనీలో అమ్మాయిని ప్రేమలో పడేయడానికి చేసే ప్రయత్నాలు సోసోగా సాగాయి. అయితే వీటిని హిలేరియస్‌గా తెరకెక్కించాల్సింది. దాంతో టేకాఫ్ బాగుండేది. ప్రారంభ సన్నివేశాలు పగలబడి నవ్వించేలా ఏం లేవు. జస్ట్.. టైమ్ పాస్ కి అన్నట్టు సాగిపోతుంటాయంతే! సప్తగిరి కమెడియన్ కాదు కాబట్టి… ఇప్పుడు హీరో అయ్యాడు కాబట్టి ఓ హీరోయిన్ని తీసుకొచ్చారు. తాను సప్తగిరి కంటే అందంగా ఉండకూడదని సప్తగిరి, దర్శకుడు ఇద్దరూ కలసి మాట్లాడుకొన్నారేమో. ఓ బిలో యావరేజ్ అమ్మాయిని తీసుకొచ్చి, ఆమెకు ఏమాత్రం డైలాగులు ఇవ్వకుండా బాగా మేనేజ్ చేశారు. పాటలకు రమ్మంటే వచ్చింది. నీ అవసరం లేదు పొమ్మంటే పోయింది. చివరికి డాక్టర్ని కాస్త బికారిగా, అనాకారిగా చేసినా ఓర్చుకొంది.
సెకండాఫ్‌లో కానిస్టేబుల్ గా సప్తగిరి కష్టాలు మొదలుతాయి. ఏంటో సెంటిమెంట్ టచ్ బాగా పెరిగిపోయిందనుకొన్న సమయంలో రివైంజ్ డ్రామా మొదలవుతుంది. తండ్రిని చంపిన హంతకుల భరతం పట్టడానికి డిసైడ్ అవుతాడు హీరో. ఆయా సన్నివేశాలన్నీ అద్భుతంగా, రోమాంఛితంగా ఉంటే బాగుణ్ణు. కానీ అక్కడా.. సప్తగిరి కమెడియన్ అన్న విషయమే అడ్డొచ్చింది. కామెడీ హీరో కాబట్టి, రివైంజ్ కూడా కామెడీగా ఉండాలని దర్శకుడు భావించి ఉంటాడు. కాకపోతే ఆ కామెడీ కాస్త ట్రాజెడీ అయ్యింది. తలకు తల, చావుకి చావు, రేప్‌కి రేప్ అన్నట్టు ఓ రేపిస్టుని నలుగురు `గే`ల చేత రేప్ చేయిస్తాడు హీరో. ఇది.. పైత్యం అనుకోవాలో కొత్త థాట్ అనుకోవాలో అర్థం కాదు. చైన్లు లాక్కెళ్లే వాళ్లకు కొత్త శిక్ష వేశాడు. ఎనస్తీషియా ఇచ్చి… చేతులు నరికేశారు. ఆయా సన్నివేశాలన్నీ బీభత్సంగా ఉంటాయి. ఎనస్తీషియా ఇచ్చి చేతులు నరికేసి, దాని చుట్టూ కామెడీగా సీన్లు అల్లుకోవడం రక్త కన్నీరు మిగులుస్తుంది. పోసానికి వాళ్ల అబ్బాయి చేతే చంపించే సీన్ కి ఇచ్చిన లాజిక్ ఏమాత్రం అతకదు. అసలు ఆ సీనే అనవసరం అనిపించింది.
* నటీనటుల ప్రతిభ
సప్తగిరి కేవలం కామెడీ చేస్తాడనుకొనేవాళ్లం. `లేదు.. నేను నవరసాలూ పండిస్తా` అని చెప్పడానికి సప్తగిరి ఇచ్చిన డెమో ఈ సినిమా. దానికి తగ్గట్టే.. ఏమంటివీ ఏమంటివీ డైలాగ్.. నిజంగానే అదరగొట్టాడు. ఆ సీన్‌కి క్లాప్స్ పడడం ఖాయం. ప్రారంభ సన్నివేశాల్లో సప్తగిరి నటన కూడా బాగుంది. డాన్సుల్లో కష్టపడినట్టు తెలుస్తున్నా.. అవుట్ పుట్ మాత్రం కమిడియన్ సీరియస్ గా వేసిన స్టెప్పుల్లానే ఉన్నాయి. సినిమా మొత్తం సప్తగిరి హవా నడిచింది. షాయాజీ షిండే, పోసాని లాంటి వాళ్లున్నా.. వాళ్లకు పెద్ద ఛాన్స్ ఇవ్వలేదు. ఉన్నంతలో షకలక, శివ ప్రసాద్‌లు మాత్రం ఆకట్టుకొంటారు. హేమని ఓ లేడీ విలన్‌గా చూపించారు. ఆడవాళ్లని ఎగరేసి ఎగరేసి కొట్టడం (ఎంత విలన్ అయినా) చూడ్డానికి కాస్త ఇబ్బందిగా అనిపించింది.
* సాంకేతిక వర్గం
ఈ సినిమా బడ్జెట్ రూ.9 కోట్లు అంటూ ప్రచారం సాగుతోంది. మేకింగ్‌లో ఆ వాల్యూ కనిపిస్తోంది. అయితే సప్తగిరి లాంటి కమెడియన్‌తో సినిమా తీస్తున్నప్పుడు బడ్జెట్ పరిమితులూ దృష్టిలో పెట్టుకోవాల్సింది. పాటలు, ఆర్.ఆర్ ఓకే అనిపిస్తాయి. క్యాచీ ట్యూనులేం లేవు. పేథాస్ పాట, దాన్ని పాడిన విధానం బాగున్నాయి. దర్శకుడిగా అరుణ్ పవార్ కి ఇది తొలి చిత్రం. సప్తగిరి ఏం చెబితే అది చేశాడనిపిస్తోంది. పైగా ఇది ఆయన సొంత కథేం కాదు. తమిళ చిత్రానికి రీమేక్. ఈ మాత్రం కథ కోసం తమిళ సినిమా హక్కుల్ని ఎందుకు ప్రత్యేకంగా కొని తెచ్చుకొన్నారో?? హీరోగా సప్తగిరికి.. దర్శకుడిగా అరుణ్ పవార్‌కి ట్రైల్ వేసుకోవడానికి ఎక్కిన రైల్ ఇది. అంతే. అంతకు మించి ఏం లేదు!
తెలుగు 360 రేటింగ్ : 2/5