హైదరాబాద్: సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తనవల్లే రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని, అయినా పార్టీ తనకు ఏమీ చేయలేదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఇటీవల నియమితులైన పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ వ్యాఖ్యానించటంపై వి.హనుమంతరావు నిప్పులు చెరిగారు. ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో ఉండగా దోచినది దాచుకోవటానికే శ్రీనివాస్ టీఆర్ఎస్లో చేరారని ఆరోపించారు. బీ ఫారమ్‌లు అమ్ముకున్న చరిత్ర డీఎస్దని అన్నారు. డీఎస్కే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌లో కూర్చోబెట్టి పనులు చక్కబెడతారా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చానని చెప్పిన డీఎస్, ఆ మాటను వైఎస్ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని అడిగారు.