కొత్త రాష్ట్రం తెలంగాణ అభివృద్ధి పథంలో జాతీయ రహదారులు కీలక పాత్ర పోషించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల, కేంద్ర ప్రభుత్వ ఉదార విధానం కారణంగా తెలంగాణకు పెద్ద ఎత్తున జాతీయ రహదారులు మంజూరయ్యాయి. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్లలో తెలంగాణలో నిర్మించింది 2527 కిలోమీటర్లు. సీమాంధ్రతో పోలిస్తే ఇది చాలా తక్కువ.
దేశంలో జాతీయ సగటుకంటే అత్యంత దిగువన తెలంగాణ ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. కేంద్ర ప్రభుత్వం రహదారులకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో గత రెండున్నర సంవత్సరాల్లో తెలంగాణకు 2776 కిలోమీటర్ల జాతీయ రహదారులు మంజూరయ్యాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఢిల్లీలో, హైదరాబాద్ లో ముఖ్యమంత్రి, మంత్రులు చర్చించిన ఫలితంగా పలు హైవేలు, వేలకోట్లలో నిధులు మంజూరయ్యాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీలో ఈ వివరాలను చెప్పారు. మొదటినుంచీ రహదారుల విషయంలో తెలంగాణపై చిన్నచూపే ఉండేది. ప్రధాన జిల్లా కేంద్రాల మధ్య కూడా కనీసం డబుల్ రోడ్డు లేని మార్గాలు అనేకం. గతుకుల రోడ్లు, ఇరుకు దారులే దిక్కుగా ఉండేవి. ఉమ్మడి ఏపీలో తెలంగాణపట్ల వివక్ష కొనసాగిందని కేసీఆర్ చెప్పారు. అది నిజమే అనిపించేలా గణాంకాలను వివరించారు.
ఇప్పుడు కీలకమైన జగిత్యాల, కరీంనగర్, వరంగల్ నాలుగు లేన్ల రహదారి పనులను కేంద్రం చేపట్టింది. సూర్యాపేట, ఖమ్మం, కోదాడ ఖమ్మం తదతర రహదారుల రూపురేఖలు మారనున్నాయి. సరుకుల రవాణాతో పాటు ప్రయాణికుల రాకపోకలు సులువుగా జరగడం, ప్రయాణ సమయం కలిసి రావడం సహా అనేక ప్రయోజనాలు కలిగించే రోడ్ల విస్తరణ తెలంగాణలో పెద్ద ఎత్తున జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం, సహకారంతో కొత్త రాష్ట్రం అభివృద్ధి వేగంగా బాటలు పడుతున్నాయి.