నల్లధనంపై బ్రహ్మాస్త్రం అంటూ ప్రధాని మోడీ తీసుకున్న ప్రతిష్టాత్మక నోట్ల రద్దు నిర్ణయం లక్ష్యానికి దూరంగా తగిలినట్టే ఉంది! దేశంలోని నల్లధనమంతా తెల్లగా మారిపోయింది! చెలామణిలో ఉన్న కరెన్సీ అంతా దాదాపుగా బ్యాంకులకు చేరిపోయింది. ఈ నిర్ణయం తరువాత బడా బాబులందరూ బ్యాంకుల ముందుకు క్యూలు కడతారు అనుకున్నారు. కానీ, సామాన్యుడే బలయ్యాడు. ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. సరే, ఇదంతా సగటు భారతీయుడి ఆవేదన. ఒక సామాన్యుడి కోణం నుంచి కాసేపు పక్కకు వెళ్లి… మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని స్థూలంగా అంతర్జాతీయ వాణిజ్య పత్రికలు ఎలా చూస్తున్నాయీ… ఏవిధంగా అభివర్ణిస్తున్నాయీ అనేది కాసేపు చూద్దాం.
సరే, మోడీ తీసుకున్న నిర్ణయం సామాన్యుడికి అర్థం కాకపోయి ఉండొచ్చు. కనీసం మేధావులకైనా అర్థం కావాలి కదా. కనీసం ఫోర్బ్స్ లాంటి ప్రముఖ పత్రికలైనా ఆహా ఓహో అనాలి కదా! అలా అనడం లేదు. భారతదేశంలో భాజపా సర్కారు తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై ఫోర్బ్స్ పత్రిక తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందని చెప్పాలి. ‘నోట్ల రద్దును ఎలా చెయ్యకూడదో అనేది చెప్పడానికి ఇదో ఉదాహరణగా నిలుస్తుంది’ అని ప్రముఖ వాణిజ్య ఫోర్బ్స్ అభిప్రాయపడింది. అక్కడితో వదల్లేదు… నోట్ల రద్దు తరువాత మోడీ సర్కారు తీసుకున్న చర్యల్ని కూడా కడిగిపారేసింది.
ఉన్నపళంగా ప్రజలను నగదు రహితం వైపు వెళ్లిపోవాలని చెప్పడం అవివేకం అని వ్యాఖ్యానించింది. నోట్ల రద్దును దేశ ప్రజలపై బలవంతంగా రుద్దడం సరైంది కాదని చెప్పింది. అంతేకాదు, డిజిటల్ ఎకానమీ అనేది చాలా సులువైన మార్గాల ద్వారా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలకు అలవాటు చేయాలని ఫోర్బ్స్ పేర్కొంది. దేశంలో దాదాపు 86 శాతం చెలామణిలో ఉన్న కరెన్సీని ఒక్కసారిగా రద్దు చేయడం చాలా తొందరపాటు చర్య అంటూ ఓ వ్యాసంలో ఆ పత్రిక అభిప్రాయపడింది.
ఒక అంతర్జాతీయ వాణిజ్య పత్రిక ఇలా స్పందించిందీ అంటే… ఇది కూడా ప్రతిపక్ష పార్టీల విమర్శగానే భాజపా అర్థం చేసుకుంటుందేమో! రాహుల్ గాంధీ చేసిన విమర్శలా కొట్టి పారేస్తారేమో! లేదా, మన్మోహన్ సింగ్ చెప్పిన మాటలకు పెడార్థాలు తీసినట్టు ఎద్దేవా చేస్తారేమో! వారు ఎలా స్వీకరించినా.. దేశాన్ని ఆర్థిక సంక్షోభం అంచులకు తీసుకెళ్లిపోతున్నారనే ఆవేదన ఆర్థికవేత్తల నుంచీ వ్యక్తమౌతోంది. ఈ వాస్తవాలపై ప్రధానమంత్రి ఆలోచిస్తున్నట్టుగా లేదు. విమర్శల్ని తిప్పి కొట్టడంపైనే ఆయన దృష్టి పెడుతున్నారు. ఆ విమర్శలను విశ్లేషించే స్థితిలో ఆయన లేరని అర్థమౌతోంది. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఇగో సమస్యగా తీసుకుని అమలుచేస్తున్నట్టున్నారు. ఏదైమైనా, అంతర్జాతీయ వాణిజ్య సమాజంలో మోడీ నిర్ణయంపై ఇలాంటి అభిప్రాయం ఏర్పడుతోందని చెప్పుకోవాలి. ఈ అభిప్రాయం దీర్ఘకాలంలో దేశానికి కచ్చితంగా మంచిది కాదు.