తెలుగుభాషను ప్రజల భాషగా మార్చిన గిడుగు రామమూర్తి గారి జయంతి (ఆగష్టు29) నాడు తెలుగు ప్రముఖుల్ని సత్కరించి, ఇవాళ టివి చానళ్ళలో…రేపటి దినపత్రికలలో తెలుగు భాషాదినోత్సవాన్ని ఘనంగా జరిపేసే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సొంత రాష్ట్రంలో వున్న పీఠాల అతీగతీ పట్టించుకోవడం లేదు.
హైదరాబాద్, వరంగల్, శ్రీశైలం, కూచిపూడి, రాజమండ్రి లలో పీఠాలు వున్న తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రవిభజన సందర్భంగా 10 వషెడ్యూలులో అంటే ఉభయ రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్ణయించుకోవలసిన లేదా పరిష్కరించుకోవలసిన ఆస్తుల జాబితాలో చేర్చారు. 600 కోట్ల రూపాయల భూమి, భవనాలు, గ్రంధాల ఆస్ధులతో హైదరాబాద్ లలిత కళా ప్రాంగణంలో వున్న విశ్వవిద్యాలయం తెలంగాణా ప్రభుత్వానికి (అనేక ఉమ్మడి ఆస్తుల మాదిరిగానే) సిద్ధాన్నంగా దక్కింది. ఈ ప్రధాన ప్రాంగణంలో సామాజిక మరియు ఇతర విజ్ఞానాల పీఠం, ప్రసార మరియు పాత్రికేయ శాఖ, జ్యోతిష మరియు వాస్తు శాఖ, తులనాత్మక అధ్యయన పీఠం, అనువాదాల శాఖ, సాహిత్య పీఠం, తెలుగు సాహిత్య అధ్యయన శాఖ,లలిత కళల పీఠం,సంగీత శాఖ,నాట్య శాఖ,జానపద కళల శాఖ,రంగస్థల కళల శాఖ,శిల్ప మరియు,చిత్ర కళల శాఖ, సంస్కృతి మరియ పర్యటన శాఖలు విద్యార్ధులతో కళకళలాడుతూంటాయి. అలాగే వరంగల్ లోని పోతన ప్రాంగణంలో జానపద మరియు తెగల సాహిత్య పీఠం, జానపద అధ్యయన శాఖ, తెగల అధ్యయన శాఖ వున్నాయి.
తెలంగాణా ప్రభుత్వం తన రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్ పీఠాలను మాత్రమే కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం, కూచిపూడి, రాజమండ్రి పీఠాలను పట్టించుకోవడంమానివేసింది. ఈ పీఠాల్లో అధ్యాపకులు, సిబ్బందికి జీతాలను నిలిపి వేశారు. అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేయలేదు.తెలుగు విశ్వవిద్యాలయం పేరుని స్వాతంత్ర సమరయోధుడు, చరిత్రకారుడు సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయంగా మార్చాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరూ పట్టించుకోని స్ధితిలో శ్రీశైలంలోని పాల్కురికి సోమనాథ ప్రాంగణంలో గల చరిత్ర, సంస్కృతి పురాతత్వ పీఠం, తెలుగు మాట్లాడు ప్రజల చరిత్ర సంస్కృతి శాఖ, ప్రాచీన శాసన లిఖిత ఆధారాల శాఖ, పురాతత్వ శాఖ ల విద్యార్ధులు అధ్యాపకులు భవిష్యత్తేమిటో తెలియక దిగులు పడుతున్నారు.కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్రయోగి ప్రాంగణంలో సిద్ధేంద్ర యోగి కళా పీఠం స్ధితీ, రాజమండ్రిలో నన్నయ ప్రాంగణం, భాషాభివృద్ధి పీఠం, భాష అధ్యయన శాఖ, నిఘంటు తయారీ శాఖ ల గతీ కూడా కూడా ఇలాగే వుంది.
ఒక విధంగా ఈ మూడుపీఠాలూ ప్రస్తుతానికి మూతపడి వున్నట్టే తెలంగాణా ప్రభుత్వాదేశాల ప్రకారం విశ్వవిద్యాలయ అధికారులు తాము నిర్ణయం తీసుకునే ముందు, ఆంధ్రప్రదేశ్ అధికారులతో సంప్రదించారు. జీతాలు, నిర్వహణ నిమిత్తం 6 కోట్లరూపాయలు చెల్లిస్తే ఈ పీఠాల బాధ్యతను కూడా స్వీకరించగలమని చెప్పారు. అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంసిద్ధత వెలిబుచ్చింది. అయితే ఆమేరకు ఒప్పందాల మీద సంతకాలు చేయకపోవడంతో ఈ పీఠాలను తెలుగు విశ్వవిద్యాలయం గాలికి వొదిలేసింది. పూర్తిగా విభజన అయ్యాక తెలుగు విశ్వవిద్యాలయం ఆస్ధుల నుంచి ఆంధ్రప్రదేశ్ కు వాటా వస్తుంది. బుక్ అడ్జస్ట్ మెంటుగా తెలంగాణాకు ఆరుకోట్లు చెల్లించేబదులు పది కోట్లు ఖర్చుపెట్టి 40 ఎకరాల సొంత స్ధలం వున్న రాజమండ్రి పీఠాన్నే తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్ధాపించాల యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వంటి భాషా వేత్తలు సూచిస్తున్నారు.
చరిత్రి సంస్కృతి భాషాసొగసులను పదేపదే ప్రస్తావించి ప్రపంచవ్యాప్తంగా వున్న తెలంగాణా ప్రజల్లో ఆరాష్ట్రం ఏర్పాటుకి ముందే కెసిఆర్ భావసమైక్యతను సాధించారు. గోదావరి పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు వారి సాంస్కృతిక పార్శ్వాన్ని ఉద్వేగపూరితంగా స్పృశించారు. రాజరాజనరేంద్రుడి తెలుగు సేవను ప్రస్తుతించారు. రాజమండ్రి పేరును రాజరాజమహేంద్రవరంగా మార్చేస్తున్నామన్నారు. ఇక్కడే తెలుగు విశ్వవిద్యాలయం స్ధాపిస్తామన్నారు. అవేమీ ఇంకా జరగలేదు. వీటి మాట ఎలావున్నా శ్రీశైలం, కూచిపూడి, రాజమండ్రిలలోని తెలుగు పీఠాల లలో విద్యా సంవత్సరానిక అవరోధం లేకుండా చూడవలసిన, అధ్యాపకులకు జీతాలు చెల్లించవలసిన తక్షణ అవసరం వుంది.