చిన్న సినిమాని తేలిగ్గా తీసుకోకూడదు. అద్భుతాలు సృష్టించే సత్తా చిన్న సినిమాకి ఉంది. ఈ యేడాది వచ్చిన పెళ్లి చూపులు సినిమానే ఇందుకు అతి పెద్ద ఉదాహరణ. అందులో స్టార్లు లేరు. గొప్ప కథా కాదు. కేవలం ట్రీట్‌మెంట్‌తోనే ఆ సినిమాని నడిపించారు. కొత్త దర్శకుల ఆలోచనలు, వాళ్ల నైపుణ్యంపై కచ్చితంగా నమ్మకం ఉంచొచ్చన్న భరోసా కలిగించిన సినిమా అది. ఇప్పుడు ‘పిట్టగోడ’పైనా అలాంటి అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ‘పెళ్లి చూపులు’, ‘పిట్టగోడ’ సినిమాలకు కొన్ని కామన్ లక్షణాలున్నాయి. రెండూ కొత్త వాళ్లతో చేసిన ప్రయత్నాలే. అన్నింటికంటే మించి ఈ రెండు సినిమాలకూ వెనుక డి.సురేష్ బాబు లాంటి మేకర్ ఉన్నాడు. అందుకే ‘పిట్టగోడ’పై ఆశలు పెరిగాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? అంచనాల్ని అందుకొందా? లేదా? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
* కథ
గోదావరి ఖనిలో స్ట్రయికర్స్ టీమ్ అంటే మంచి ఫేమస్. అలాగని వాళ్లేం గొప్పగా ఆడింది లేదు. చదివిందీ లేదు. ఎప్పుడూ పిట్టగోడ మీద కూర్చుని ఊసుపోని కబుర్లు చెబుతుంటారు. వాళ్లే…. టిప్పు, వేణు, నాగరాజు, జ్ఞానేశ్వర్. వీళ్లకు కనీసం వీళ్ల ఇళ్లల్లో కూడా గౌరవం ఉండదు. దాంతో ఓసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సి వస్తుంది. ఊర్లో గౌరవం నిలబడాలంటే.. కచ్చితంగా ఏదోటి చేసి పేపర్లో ఫొటో పడేట్టు చేసుకోవాలని ఫిక్సవుతారు. అందుకు వాళ్లు ఎంచుకొన్న ఏకైక మార్గం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం. ఈలోగా ఆ కాలనీకి దివ్య అనే అమ్మాయి కొత్తగా వస్తుంది. టిప్పు ఆ అమ్మాయి ప్రేమలో పడిపోతాడు. మెల్లమెల్లగా దివ్య కూడా దగ్గరవుతుంది. అయితే.. టిప్పు.. వాళ్ల స్నేహితులు సడన్‌గా ఇబ్బందుల్లో పడతారు. టోర్నమెంటు ఆగిపోతుంది. పోలీసు కేసులు, గొడవలు అవుతాయి. నలుగురు స్నేహితులూ విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదంతా ఎందురు జరిగింది? కారణం ఎవరు? అనేది తెరపై చూడాల్సిందే.
* తెలుగు 360 విశ్లేషణ
నేచురల్ లొకేషన్స్, మేకప్ లేని మొహాలు, బిల్డప్పులు లేని ఎంట్రీలూ, హీరోయిన్ లక్షణాలేమాత్రం లేని అమ్మాయి.. నాలుగైదు సీన్లతోనే ఈ సినిమా ఫ్లేవర్ అర్థమైపోతుంది. గోదావరి ఖనిలో పిట్టగోడ ఎక్కి కబుర్లు చెప్పుకొనే ఓ వేస్ట్ బ్యాచ్‌కి ఇచ్చిన ఇంట్రడక్షన్.. వాటిని ఫాలో అవుతూ వచ్చిన సీన్లు.. ‘ఇదేదో మంచి సినిమానే’ అనే ఫీలింగ్‌ని కలిగిస్తాయి. జోక్ కోసం జోక్ అని కాకుండా, పంచ్‌ల కోసం ప్రయత్నించకుండా నవ్వించే ప్రయత్నం చేస్తుంటే.. ఆ నమ్మకం మరింత ఎక్ఉవ అవుతూ వస్తుంది. పేపర్లో ఫొటో పడాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ‘ఐతే’లాంటి సినిమా ‘ఐతే’ బాగుంటుందేమో అనిపిస్తుంది. క్రికెట్ టోర్నమెంటూ హడావుడి చూసి ఇంకేదో చూపిస్తారేమో అనే ఆశ కలుగుతుంది. అయితే.. ఇంత బిల్డప్ ఇచ్చి సడన్‌గా సినిమాని, మనలోని ఉత్సాహాన్ని అక్కడే ఆపేశాడు దర్శకుడు. దివ్య వెనుక ఓ కథ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకొన్న హీరో చలించిపోతాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటన్నది ఫ్రెండ్స్‌కి కూడా చెప్పడు. దాంతో.. చిన్నప్పటి నుంచీ దోస్త్ మేరా దోస్త్ అంటూ తిరిగిన వాళ్ల బంధం.. వీడిపోతుంది. అది ఏమై ఉంటుందా? అని ఆడియన్ కూడా అరగంట వేచి చూడాల్సివస్తుంది. అలాంటప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ బాషా స్థాయిలో ఎంత గంభీరంగా ఉండాలి? దాన్ని తుస్ మనిపించాడు దర్శకుడు. అక్కడే పిట్టగోడకు బీటలు వారాయి.
దొంగ నోట్ల వ్యవహారంతో ఆ గోడపై సిమెంటు పూసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ… ఆ సీన్లు కూడా అతికించినట్టే అనిపిస్తాయి. పెళ్లిలో హీరోయిన్ని ఎత్తుకొచ్చేయడం. విలన్ ఆట కట్టించడానికి స్నేహితులు చేసే యత్నాలూ ఇవన్నీ సిల్లీగా ఉంటాయి. గోదావరి ఖనిలో జరిగే కథ ఇది. అందరూ తెలంగాణ యాసలోనే మాట్లాడుతున్నామనుకొంటారు. అప్పుడప్పుడూ రకరకాల యాసలు అందులో మిక్స్ అయిపోతుంటాయి. ఓ పాత్రకి ఓ యాస ఉండాలి.. అన్న కనీస సూత్రాన్ని పాటించకపోతే ఎలా? స్నేహితులు విడిపోవడం, మళ్లీ కలుసుకోవడం .. కనీసం సీన్లయినా పకడ్బందీగా రాసుకొంటే బాగుండేది. హీరో తన ఇంట్లో చెత్త ఊడ్చాడనో, కాఫీ కప్పులు ందించాడనో తెగ ఇదైపోయి.. హీరోయిన్ అతనిపై ప్రేమ చూపించేస్తుంది. ప్రేమ ఎందుకు పుట్టిందో బలమైన సీన్ ఒక్కటైనా రాసుకోకపోతే ఎలా? పిట్టగోడ ప్రారంభం బాగుంది. అదీ నాలుగైదు సీన్లే. ఆ తరవాత పూర్తిగా డ్రాప్ అయిపోయింది. రాకెట్ కొంతదూరం జువ్వున వెళ్లి.. సముద్రంలో కూలిపోతే ఎలా ఉంటుంది. పిట్టగోడ కూడా అలానే తయారైంది.
* నటీనటుల ప్రతిభ
కాస్టింగ్ పరంగా ఎవ్వరూ ఏ లోటు చేయలేదు. నిజంగానే గోదావరి ఖనిలో నలుగురు స్నేహితుల్ని.. ఆ పక్క ఇంటి కిటికీ సందుల్లోంచి చూసినట్టే ఉంటుంది. విశ్వదేవ్ రాచకొండని కావాలని కాస్త డీ గ్రామర్‌గా చూపించారేమో అనిపిస్తుంది. తన నటన సహజంగా ఉంది. కుర్రాడికి మరికొన్ని అవకాశాలు రావొచ్చు. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలకు సరిపోయే పునర్నవిని సినిమాలో ఏకంగా హీరోయిన్గా చేసేశారు. హీరోతో డ్యూయెట్లు, రొమాన్స్ లేవు కనుక.. ఓకే అనుకోవొచ్చు. స్నేహితుల బ్యాచ్, వాళ్ల తల్లిదండ్రుల కాస్టింగ్ పక్కాగా సరిపోయింది.
* సాంకేతిక వర్గం
ప్రాణం కమలాకర్ అందించిన పాటలు బాగానే ఉన్నాయి. పిట్టగోడ టైటిల్ సాంగ్ ఆకట్టుకొంటుంది. అవసరాకిని మించి పాటలు లేవు. తన ఆర్.ఆర్ కూడా బాగుంది. ‘గూర్ఖా’ అనే మాటని ఆర్.ఆర్‌లో వాడిన విధానం బాగుంది. మాటలేం కొత్తగా లేవు. అలాగని పాత పంచ్‌లను మళ్లీ వాడి విసిగించలేదు. దర్శకుడికి క్లారిటీ మిస్ అయ్యింది. ఎలాంటి కథని ఎత్తుకొన్నా.. ఎలా చెబుతున్నా.. ఎలా ముగిస్తున్నా.. అనే విషయాల్లో కన్ఫ్యూజ్ అయ్యాడు. ప్రారంభం బాగానే ఉన్నా.. దాన్ని సవ్యంగా మలచుకోలేకపోయాడు. దొంగనోట్లు, హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్‌ల జోలికి పోకుండా కేవలం సినిమా కథని ఆ నలుగురు కుర్రాళ్లూ, వాళ్ల ఆశయాల చుట్టూ నడిపించి ఉంటే బాగుండేది.
తెలుగు 360రేటింగ్: 2.75/5