హైదరాబాద్: ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ తాము నిర్వహించిన బంద్ విజయవంతమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకటించింది. విఫలం చేయటానికి ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించారని వైసీపీ నేతలు బొత్స, ధర్మాన ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు. ఇక జగన్ అయితే బంద్‌కు సహకరించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ బంద్ ప్రజల ఆకాంక్షలను తెలియజేసిందని చెప్పారు. బంద్ నిర్వహిస్తున్న 40మంది ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారని ఆరోపించారు. కావాలనే 144 సెక్షన్ అమలు చేశారని, విద్యార్థులను చితకబాదారని అన్నారు.
మరోవైపు, బంద్ అట్టర్ ఫ్లాప్ అయిందని తెలుగుదేశం నేతలు చెప్పుకొచ్చారు. ఈ బంద్‌ను జనం అస్సలు పట్టించుకోలేదని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు చెప్పారు. రాఖీ పండగరోజు బంద్‌కు పిలుపునిచ్చి జగన్ హిందూ సంప్రదాయాలను గాలికొదిలేశారని ఆరోపించారు. వైసీపీ బంద్‌ను కేవలం ఒక ఈవెంట్ జరపటంకోసం ప్రయత్నిస్తోందితప్ప ప్రజలకు మేలుచేసే ఉద్దేశ్యంతోకాదని టీడీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు అన్నారు.
ఏది ఏమైనా బంద్‌ను విజయవంతం చేయాలనీ వైఎస్ఆర్ కాంగ్రెస్, విఫలం చేయాలని ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించాయనేది వాస్తవం. అయితే వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చేయటం, కమిటెడ్ కార్యకర్తలు ఉండే వామపక్షాలు మద్దతు పలకటంతో బంద్ విజయవంతమైందనే చెప్పాలి. రాజమండ్రి, అనకాపల్లివంటి కొద్దిచోట్ల వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లను ముట్టడించిన ఘటనలు మినహా దాదాపు ప్రశాంతంగానే సాగింది. జగన్, బొత్స, ధర్మాన వంటివారు తప్పితే వైసీపీలోని నేతలందరూ రోడ్లపైకి వచ్చి బంద్ చేయించారు. విజయసాయిరెడ్డి, కొడాలి నాని, వంగవీటి రాధా, పార్థసారధివంటి నేతలు అరెస్ట్ అయ్యారు.