‘తిన్నది అరగక కొట్టుకుంటున్నాయి…’ జీతాలు పెంచమని ధర్నా చేస్తున్న మహిళా ఉద్యోగులను ఉద్ధేశ్యించి టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బహిరంగంగా, అందరూ చూస్తుండగానే ఎలాంటి సంకోచం లేకుండా అన్న మాటలివి. ఆ మధ్య ఇసుక వివాదానికి సంబంధించిన విషయంలో కూడా ఒక స్థాయిలో ఉన్న ప్రభుత్వ మహిళా ఉద్యోగిని బూతులు తిట్టిన ఎమ్మెల్యేగారు కూడా ఈ మహానుభావుడే. మీడియా సమక్షంలోనే ఈ రేంజ్లో బూతులు లంకించుకునే ఈయనగారు ఎవ్వరూ చూడని సమయంలో ఇంకే స్థాయిలో రెచ్చిపోతారో వేరే చెప్పాలా? అన్నట్టు అనుచరుల చేత మీడియా కెమేరాలను విరగ్గొట్టించడం, జర్నలిస్టులను కొట్టించడం ఈయనకు చాలా మామూలు వ్యవహారం. ఇక మంత్రి రావెల కిషోర్బాబుని అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అని చెప్పొచ్చు. కొడుకు రావెల సుశీల్‌బాబు వ్యవహారాన్ని మనం కళ్ళారా చూశాం. కోర్టుల్లో మేనేజ్ చేసుకోవడం, సాక్షులను బెదిరించడం లాంటివి అధికారం, డబ్బు బలం ఉన్నవాళ్ళకు మంచినీళ్ళ ప్రాయం. ఆ విషయం పక్కన పెడితే చేసిన తప్పు మాత్రం వీడియోల్లో, ప్రజల ఆలోచనల్లో ఇప్పటికీ ఉంది. ఆ తప్పు మర్చిపోక ముందే ఇప్పుడు కొడుకును మించిన తండ్రి అనేలా రావెల కిషోర్‌బాబు వ్యవహారం బయటకు వచ్చింది. పార్టీలో ఉన్న సీనియర్ మోస్ట్ నాయకులు, చంద్రబాబుకంటే ముందే టిడిపిలో చేరి ఉన్న నాయకులు కూడా చంద్రబాబుని, లోకేష్‌ని విమర్శించాలంటేనో, కనీసం వాళ్ళ అభిప్రాయాలను ఖండించాలంటేనో భయపడతారు. అదీ టిడిపిలో ఉండే ప్రజాస్వామ్యం. మోడీ, చంద్రబాబు, కెసీఆర్, జగన్‌లతో పాటు ఇండియాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అధినేతలు చేతల్లో చూపించేది నియంతృత్వం, రాచరిక పాలనే. మాటల్లో మాత్రమే పెజాస్వామ్యం, పెజా సేవ అంటే వాళ్ళకు ఎంత కసి ఉంది అనే విషయాన్ని మనకు చెప్తూ చెవుల్లో పూలు పెడుతూ ఉంటారు. మరి అలాంటి పార్టీలో జెడ్పీ ఛైర్ పర్సన్ స్థాయిలో ఉన్న ఒక నాయకురాలు పార్టీకి నష్టం కలుగుతుందని తెలిసి కూడా బహిరంగంగా తన ఆవేధనను చెప్పుకున్నారంటే తెరవెనుక వేధింపులు ఏ స్థాయిలో జరిగి ఉండాలి. ఆ వేధింపుల గురించి ముందుగా పార్టీ అధినేతలకు, సీనియర్ నేతలకు చెప్పకుండా ఉండి ఉంటుందా? అధికారంలో లేని పార్టీ అయితే జానీమూన్ తర్వాత జంపింగ్ ఏంటి? అని అనుమానించొచ్చు. కానీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం రాజకీయ భవిష్యత్తుపైన ఆశలున్న ఏ నాయకుడు కూడా పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరించడు. జానీ మూన్ ఆవేదన నిజం.
ఇసుక దోపిడీని అడ్డుకున్న మహిళా అధికారిదే తప్పు అని తీర్మానించిన చంద్రబాబు పార్టీ చింతమనేని ప్రభాకర్‌కి సర్టిఫికెట్ ఇచ్చింది. రావెల సుశీల్‌బాబు విషయంలో కూడా తప్పంతా వైఎస్ జగన్‌దే అని కూడా ఆరోపించడానికి సాహసించారు కానీ సుశీల్బాబుది తప్పు అని చెప్పిన టిడిపి నాయకుడు ఒక్కడు కూడా లేడు. ఇప్పుడిక రావెల కిషోర్‌బాబు విషయంలో కూడా అలాంటి ప్రతిస్పందనలే కనిపిస్తున్నాయి. అది పార్టీ అంతర్గత వ్యవహారం అని చెప్తున్నారు. బాగుంది, చాలా బాగుంది…అద్భుతః అని కూడా చెప్పొచ్చు. మరి ఇదే టిడిపి నాయకులు, ఆ పార్టీ అనుకూల మీడియా అంబటి రాంబాబు విషయంలో ఎలా స్పందించిందో జనాలకు ఇంకా గుర్తుందిగా. ఆ రోజు అంబటి వ్యవహారంలో కూడా ఆ పార్టీ అంతర్గత వ్యవహారం అని ఎందుకు చెప్పలేదు. ఇక్కడ అంబటి రాంబాబును ఎవ్వరూ సమర్థించడం లేదు. అంబటి చేసింది ముమ్మాటికి తప్పే. ఆయనను ఇంకా పార్టీలోనే కొనసాగనిస్తున్న జగన్ విలువలను కూడా ప్రశ్నించాల్సిందే. మరి ఇప్పుడు చంద్రబాబు విషయంలో, టిడిపి విషయంలో ఎందుకు ఆ స్థాయి స్పందనలు లేవు అన్నదే ప్రశ్న. ఏ పదవీలేని అంబటి రాంబాబు చేసిన తప్పుకంటే మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్, రావెల కిషోర్‌బాబు చేస్తున్నవి ఇంకా పెద్ద తప్పులు అయినప్పటికీ ఎందుకు రియాక్ట్ అవడం లేదు.
‘నా అక్కచెల్లెల్లకు, ఆడపడుచులకు….’ అంటూ అస్తమానూ మహిళల గురించి గొప్పగా మాట్లాడేస్తూ, మహిళలను కోటీశ్వరులను చేయడం, మహిళలను ఉద్ధరించడమే నా జీవిత లక్ష్యం అని మాటలు చెప్పే నేతల చేతలు మాత్రం ఇంత దారుణంగా ఉంటాయి. ఆయన ఉన్నప్పుడే బాగుండేది, ఆయన వస్తేనే బాగుంటుంది అని ఎన్నికల సమయంలో వినిపించిన ప్రకటనల హోరు ఇంకా చెవుల్లో మార్మోగుతూనే ఉంది. కానీ అత్యాచారాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. మహిళలు బయటకు వెళ్తూ ఉన్నప్పుడల్లా ఇంటిల్లిపాదీ భయం భయంగానే ఆలోచిస్తున్నారు. రెండున్నరేళ్ళ తర్వాత కూడా బాబుగారి పాలనలో వచ్చిన మార్పు ఏమీ లేదు. అయినా మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహారమే ఇలా ఉంటే ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మహిళలకు రక్షణ ఉంటుందని, అత్యాచారాలు ఆగిపోతాయని, మహిళలు ధైర్యంగా బ్రతకగలిగే పరిస్థితులు ఉంటాయని ఎలా ఆశించగల? ముందు సొంత ఆలోచనలతో, సొంత కష్టంతో అభివృద్ధి చెందాలనుకుంటున్న మహిళలకు కనీస భద్రత కల్పించండి సార్లూ…….ఆ తర్వాత మహిళలను లక్షాధికారులను, కోటీశ్వరలను చేసే కార్యక్రమాలు చించేద్దురుగానీ………..