ఫ్లాప్ అనే మాట వినడానికే చిత్రసీమ ఇష్టపడదు. అదే డిజాస్టర్ అన్న ముద్ర వేస్తే…?? ఫ్లాప్ సినిమాని ‘అయ్యో..’ అని జాలిపడగలం. అదే డిజాస్టర్ అయితే.. అదీ ఉండదు. ఉన్నదంతా ఊడ్చేసిన సినిమాలనో. లేదంటే.. భారీ అంచనాలు మోసుకొంటూ వచ్చి కనీస వసూళ్లని సైతం అందుకోని సినిమాల్ని ట్రేడ్ వర్గాలు ‘డిజాస్టర్’ అనే ముద్ర వేస్తుంటుంది. ఏ కేలండర్ తీసుకొన్నా.. డిజాస్టర్లు కనిపిస్తూనే ఉంటాయి. సూపర్ హిట్లు తక్కువగా ఉన్నా.. ఈ డిజాస్టర్లు మాత్రం భారీ స్థాయిలో కనిపిస్తుంటాయి. 2016లోనూ అట్టర్ ఫ్లాప్ సినిమాల లిస్టు పెద్దదే ఉంది. కనీసం ప్రతీ నెలా ఓ డిజాస్టర్ అయినా.. ‘హలో’ అంటూ భయపెట్టింది. యేడాది మొత్తానికి చూస్తే డజనుకు పైగానే డిజాస్టర్లు కనిపిస్తాయి. అవన్నీ ఓసారి రివైండ్ చేసుకొంటే..??
జనవరి 1నే ఓ డిజాస్టర్ తగిలింది. గతేడాది హిట్లతో దూసుకొచ్చిన నాగశౌర్య నటించిన ‘అబ్బాయితో అమ్మాయి’ దారుణంగా ఫ్లాప్ అయ్యింది. తొలి రోజు నుంచే ఈ సినిమాకి ఆడియన్స్ కనిపించలేదు. ఫిబ్రవరిలో వచ్చిన ‘గరమ్’, ‘కృష్ణాష్టమి’, ‘అటాక్’లు కూడా అట్టర్ ఫ్లాప్స్ లిస్టులో చేరిపోయాయి. ఈ సినిమాలకు కనీస ఓ పెనింగ్స్ కూడా రాలేదు. మార్చిలో విడుదలైన మంచు మనోజ్ ‘శౌర్య’ కూడా అట్టర్ ఫ్లాపే. ఇక ఏప్రిల్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సగానికి సగం పోగొట్టుకొంది. భారీ ఓపెనింగ్స్ వచ్చినా – నెగిటీవ్ టాక్ బాగా స్పైడ్ అవ్వడం వల్ల సర్దార్ లెక్క తప్పింది. ఈ సినిమాతో నష్టపోయిన పంపిణీదారుల్ని ఆదుకోవడానికి పవన్ ‘కాటమరాయుడు’ అనే సినిమా ప్లాన్ చేశాడంటే.. సర్దార్ వల్ల ఎంత పోయిందో అంచనా వేసుకోవచ్చు. మేలో మరో డిజాస్టర్ తగిలింది. ఈసారి ఈ సినిమా మహేష్ బాబు నుంచి వచ్చింది. శ్రీకాంత్ అడ్డాల కాంబోలో వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా బాగా నిరాశ పరిచింది. కథ, కథనాలు కూడా బోరింగ్‌గా ఉండడంతో.. మహేష్ అభిమానులు కూడా ఈ సినిమాని విమర్శించడం మొదలెట్టారు. దానికి తోడు మహేష్ నటించిన ఏ ఫ్లాప్ సినిమాకీ రానంత నెగిటీవ్ టాక్ ఈ సినిమా మూటగట్టుకొంది. ఆన్లైన్లో కూడా ఈ సినిమాపై బోల్డన్ని సెటైర్లు పుట్టుకొచ్చాయి.
జూన్‌లో మెగా డాటర్ కొణిదెల నిహారిక నటించిన ‘ఒక మనసు’ విడుదలైంది. ఈ సినిమాతో ఓ టాప్ హీరోయిన్ ఇండ్రస్ట్రీకి పరిచయం అవ్వబోతోందని అంతా ఆశించారు. తీరా చూస్తే ఒక మనసు తుస్సుమంది. దీన్ని ఓ పాత కాలం సినిమాగా ముద్ర వేసేశారంతా. దాంతో పెట్టుబడిలో పావు వంతు కూడా రాలేదు. త్రిషకి ఈ యేడాదీ కలసి రాలేదు. నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రంలో తొలిసారి కనిపించిన ‘నాయకి’ అడ్రస్ లేకుండా పోయింది. వరుస విజయాలతో దూకుడు మీదున్న సాయిధరమ్ తేజ్‌కి రేయ్ తరవాత తొలిసారి ఓ ఫ్లాప్ తగిలింది. అదీ.. దిమ్మ తిరిగే రేంజులో. అదే ‘తిక్క’. ఆగస్టులో విడుదలైన ఈ సినిమా కనీసం పబ్లిసిటీ ఖర్చుల్ని కూడా తీసుకురాలేకపోయింది.
నాగార్జున భారీ ఎత్తున ప్రచారం చేసిన శ్రీకాంత్ తనయుడి చిత్రం ‘నిర్మలా కాన్వెంట్’ కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. సినిమాలో విషయం లేకపోవడం, ఓ లవ్ స్టోరీని టీనేజ్ పిల్లలకూ నచ్చేలా చూపించలేకపోవడంతో నిర్మలా కాన్వెంట్ నిరాదరణకు గురైంది. నాగ్ టీవీ షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’కి ఇది ప్రోమోలా ఉందని సెటైర్లు వేశారంతా. సెప్టెంబరులోనే వచ్చిన ‘జాగ్వార్’, ‘ఈడు గోల్డెహె’ కూడా ఫ్లాపుల లిస్టులో చేరిపోయాయి. జాగ్వార్‌కి దాదాపు రూ.70 కోట్లు ఖర్చు పెట్టారు. అందులో రూ.7 కోట్లు వచ్చినా గొప్పే అన్నట్టు తయారైంది పరిస్థితి. సునీల్ కెరీర్లోనే కనీస ఓపెనింగ్స్ లేని సినిమాగా.. ‘ఈడు గోల్డెహె’ రికార్డులకు ఎక్కింది. అక్టోబరులో వచ్చిన పూరి – కల్యాణ్ రామ్ ‘ఇజం’ కూడా.. దారుణ నష్టాల్ని చవిచూడాల్సివచ్చింది. నవంబరులో ‘నరుడా డోనరకుడా’, ‘సాహసం శ్వాసగా సాగిపో..’ డిజాస్టర్ల లిస్టులో చేరాయి.
సాదాసీదా కథతో అద్భుతాలు చేద్దామనుకొంటే ప్రమాదం అని చెప్పడానికి ఈ ఉదాహరణలే తార్కాణాలు. కథ లేకుండా కేవలం కాంబినేషన్ల మీదో, లేదంటే హీరో ఇమేజ్‌ల మీదో. ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనో సినిమాలు నడిపేద్దాం అనుకొంటున్న దర్శకులకు, కథానాయకులకు ఈ పరాజయాలు ఓ కనువిప్పు కావాలి.