నల్లధనంపై పోరాటంలో భాగంగా పెద్దనోట్లను రద్దు చేసింది మోడీ సర్కారు. లక్ష్యం మంచిదే.. కానీ, అమలు తీరులో లోపాల వల్లనే ప్రజలకు అవస్థలు మిగిలాయి. సరే… పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యులకు ఎంత మేలు జరుగుతుందనే విషయాన్ని కాసేపు పక్కనపెడితే… ఇప్పుడీ నిర్ణయంపై ఎంత వరకూ పొలిటికల్ మైలేజ్ తీసుకోవచ్చు అనే ప్రయత్నాల్ని రాజకీయ పార్టీలు మొదలుపెట్టాయని చెప్పుకోవాలి. నిజానికి, ఈ ఒక్క నిర్ణయంతో దేశంలో తనకు తిరుగులేని స్థానాన్ని దక్కించుకోవాలని మోడీ ఆశించారనే అనేవారు ఉన్నారు! ఇప్పటికీ అదే ప్రయత్నంలో భాజపా నేతలు ఉన్నారు. స్వతంత్ర భారతదేశం చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం ఒక మైలురాయి అని భాజపా నేతలు బలంగానే చెబుతున్నారు. అయితే, ఆ మైలురాయి దేనికి అనేది కాలమే తేల్చుతుంది! ఇప్పుడు మిగతా పార్టీలు కూడా ఈ అంశాన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకునే నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే. దేశ ప్రజలు మోడీ నిర్ణయానికి మద్దతుగా నిలిచారని, అందుకే ఎక్కడా ఎలాంటి తిరుగబాటూ రాలేదన్నది భాజపా నాయకుల విశ్లేషణ. వారి సమర్థన ఎలా ఉన్నా… బ్యాంకు ముందు క్యూల్లో నిలబడి చాలామంది మరణించారన్నది వాస్తవం. ఇలా మృతి చెందినవారి గురించి భాజపా పెద్దలు ఎవ్వరూ నోరెత్తిన సందర్భమే లేదు. ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్.
బ్యాంకుల ముందు నిలబడి, మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న ప్రకటించారు. ఉత్తరప్రదేశ్లో ఇంతవరకూ బ్యాంకుల ముందు నిలబడి లైన్లలో మరణించిన వారి సంఖ్య 13. వారి కుటుంబాలకు వెంటనే సొమ్ము అందేలా చర్యలు చేపట్టారు. వీరితోపాటు, బ్యాంకు క్యూ లైన్లో నిలబడి, అదే సమయంలో పురిటినొప్పులు వచ్చి బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి కూడా రూ. 2 లక్షల చెక్కును అందించారు. నోట్ల రద్దుతో ప్రజలను తీవ్ర కష్టాల్లోకి నెట్టేశారనీ, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయడం ఖాయమని ఆయన అన్నారు.
సో.. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఇలా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు యూపీ సీఎం అఖిలేష్. ఈయన బాటలోనే మరికొన్ని పార్టీలూ కూడా నడిచే అవకాశం ఉంది. ఎందుకంటే, బ్యాంకుల ముందు డబ్బు కోసం నిలబడి, ప్రాణాలు కోల్పోయినవారి గురించి భాజపా ఎక్కడా ప్రస్థావించలేకపోతోంది కదా! ప్రస్థావిస్తే వారి పొలిటికల్ మైలేజ్ తగ్గిపోతుంది కదా! ఈ పరిస్థితిని ఇతర రాజకీయ పార్టీలు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి రాజకీయ రంగు పడటం మొదలైంది!