ఆయన మాటే శాసనం అంటుంటారు! ఆయనకు ఎదురు చెప్పేంత స్వేచ్ఛ ఎవ్వరికీ లేదంటారు! చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో పరిస్థితి ఇలా ఉంటుందన్న ప్రచారం ఉంది. ఏ నిర్ణయమైనా ఆయన అనుకున్నట్టుగానే చేస్తారనీ, మంత్రులకు ప్రశ్నించే అవకాశం ఉండదన్న అభిప్రాయం ఉంది. అయితే, అందరు మంత్రులూ ఒకేలా ఎందుకు ఉంటారు..? చంద్రబాబే స్వయంగా పక్కన పెట్టేసిన మంత్రులు కొంతమంది ఉన్నారన్న మాట వాస్తవం. వారి చేతులు కట్టేసి, ఆయా శాఖల కీలక నిర్ణయాలూ నియామకాలు స్వయంగా ముఖ్యమంత్రే చేసుకుంటారు. ఇప్పుడు అలాంటి కొంతమంది మంత్రులతోనే చంద్రబాబుకు కొత్త తలనొప్పి వచ్చిపడుతోంది. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఆ మంత్రులు ఏకంగా అధికార పార్టీ విధానాలపైనే బహిరంగంగా విమర్శలూ సెటైర్లూ వేసేస్తున్నారు.
రాష్ట్రంలో పరిశ్రమలపై తీరుపై మంత్రి కేయీ కృష్ణమూర్తి తాజాగా చేసిన విమర్శలు తెలుగుదేశం వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. కర్నూలు జిల్లాలు చాలా పరిశ్రమలు ఇచ్చేశామని ముఖ్యమంత్రి చెబుతారనీ, వాస్తవంలో శంకుస్థాపనకు నోచుకున్నవి ఎన్ని ఉన్నాయంటూ ఆయనో సెటైర్ వేశారు. ఆంధ్రాకి కోటాను కోట్లు పెట్టుబడులు వచ్చేశాయని ప్రచారం చేసుకుంటున్నారనీ, వాస్తవంలో వచ్చింది అంత మొత్తం ఉండదని వ్యాఖ్యానించినట్టు కథనాలు వచ్చాయి. నిజానికి, బీసీ సామాజిక వర్గానికి చెందిన కేయీ చాన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిగట్టుకుని మరీ రెవెన్యూ శాఖను టార్గెట్ చేసుకోవడంమే ఆయనలోని అసంతృప్తికి కారణం. అయితే, ఇలా వివిధ కారణాల వల్ల అసంతృప్తితో ఉన్న మంత్రులు మరికొందరు ఉన్నారని టాక్.
ఉత్తరాంధ్రకు చెందిన మరో మంత్రి కూడా చంద్రబాబు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సమయానుకూలంగా ఆయనా బహిరంగంగానే ప్రభుత్వ విధానాలపై పంచ్‌లు వేసేస్తున్నారట! తెలుగుదేశం ప్రభుత్వంలో మూడు అధికార కేంద్రాలు ఉన్నాయనీ, ఏం జరిగినా వారే చేసుకుంటారనీ, ఇతరులకు ఏమాత్రం అవకాశం ఇవ్వరని ఆ మంత్రిగారు అంటున్నారట. కొందరు మంత్రుల తీరు దారుణంగా ఉంటున్నా ముఖ్యమంత్రి చూసీ చుడనట్టుగా వారిపట్ల వ్యవహరిస్తున్నారంటూ మరో మంత్రి వ్యాఖ్యానిస్తున్నారట. ఇన్నాళ్లూ ఈ మంత్రుల్లో ఉండే అసంతృప్తి మౌనంగానే ఉండేది. కానీ, ఇప్పుడు బహిరంగంగానే చంద్రబాబుపై విమర్శలూ వ్యాఖ్యానాలూ చేస్తూ కొత్త తలనొప్పిని తీసుకొస్తున్నారు. మరి, ఈ అసంతృప్తి సెగలపై సీఎం ఏవిధంగా స్పందిస్తారో..?