నవంబరు 8న ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయ ప్రభావం సామాన్యుడిపై మామూలుగా లేదు. మొదటిరోజు నుంచి మొదలు నేటివరకూ కూడా బ్యాంకుల ముందు క్యూలు ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఏటీఎం లలో డబ్బులు లేవు. బ్యాంకు ప్రాంగణంలో ఉన్న ఏటీఎం లలో కూడా “నో క్యాష్” అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. సరేలే జరిగిందేదో జరిగింది.. ఫలితం లేదంటున్నారు.. మోడీ నిర్ణయం లక్ష్యానికి చాలా దూరంలో తగిలిందని అంటున్నారు.. ఇది చారిత్రక తప్పిదం అంటున్నారు.. ఆ సంగతులన్నీ పెద్ద పెద్ద వాళ్లకు సంబందించిన విషయాలు.. మాకు మాత్రం డిసెంబరు 30తో కష్టాలు తీరిపోబోతున్నాయి అని అనుకున్న సామాన్యుడికి మరో చేదువార్తలాంటి విషయం ఇది!
అవును.. తాజా పరిస్థితులను బట్టి చూస్తే మోడీ ముందుగా ప్రకటించినట్లుగా డిసెంబరు 30 తర్వాత ఈ నోట్ల రద్దు విత్ డ్రాస్ మీద ఆంక్షలు తొలగేటట్టు లేవు! కరెన్సీ ప్రెస్సులు, రిజర్వు బ్యాంకు.. బ్యాంకుల డిమాండ్ కు తగిన మొత్తంలో కొత్త కరెన్సీని అందించలేకపోతుండటంతో ఈ ఆంక్షలు డిసెంబరు 30 తర్వాత కూడా ఇలానే కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఏటీఎం, బ్యాంకుల నుంచి వారానికి రూ. 24 వేలు, రోజుకు రూ. 2,500 విత్ డ్రా చేసుకునే అవకాశమున్నా.. బ్యాంకులు నగదు కొరత వల్ల ఆ మొత్తాన్ని ఖాతాదారులకు అందించలేకపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలోనూ విత్ డ్రాపై ఆంక్షలు కొనసాగొచ్చని బ్యాంకర్లు చెబుతున్నారు.
ఆశించిన విధంగా బ్యాంకులకు నగదు అందే వరకు ఈ వివిత్ డ్రా ఆంక్షలు ఉంటాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య కూడా సూచన ప్రాయంగా స్పందించడం, డిసెంబర్ 30 తర్వాత విత్ డ్రా పరిమితిపై సమీక్ష ఉంటుందని ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసా చెప్పడం వీటికి సంకేతాలనే భావించాలి! కాగా… గతంలో చలామణిలో ఉన్న రూ. 15.4 లక్షల కోట్ల రూ.1,000, రూ. 500 నోట్లకు గాను నవంబర్ 8 నుంచి డిసెంబర్ 19 మధ్య కాలంలో ఆర్బీఐ విడుదల చేసిన రూ. 5.92 లక్షల కోట్ల కరెన్సీ మాత్రమే చలామణిలో ఉంది! ఇదే సమయంలో డిసెంబర్ 10 వరకు రూ. 12.4 లక్షల కోట్ల విలువైన పాతనోట్లు బ్యాంకులకు చేరాయి. కాబట్టి… మిగిలిన మొత్తం కూడా బ్యాంకులకు చేరే వరకూ విత్ డ్రాలపై ఆంక్షలు అనే విషయం కంటిన్యూ అవ్వొచ్చు!!