ఓ దర్శకుడు నోరు జారాడు. నయనతార కోపాగ్నికి గురయ్యాడు. ఆ దర్శకుడు సూరజ్. ఇటీవల విశాల్‌తో ఒక్కడొచ్చాడు సినిమా తీశాడు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందన్న ఫస్ట్రేషన్లో ఉన్నాడేమో.. చటుక్కున హీరోయిన్లపై ఓ సెటైర్లాంటిది వేశాడు సూరజ్!. ”హీరోయిన్ అన్నాక గ్లామర్ గానే కనిపించాలి. మేం ఇచ్చిన చిట్టిపొట్టి డ్రస్సులే వేసుకోవాలి. అసలు ప్రేక్షకులు థియేటర్ కి వచ్చేది టికెట్లు కొనేది హీరోయిన్లను గ్లామర్‌గా చూడ్డానికే. నటించాలనుకొంటే వాళ్లు సీరియల్స్ చేసుకోవొచ్చు. సినిమాలో మాత్రం గ్లామర్‌గానే కనిపించాలి..” అంటూ చాలా చాలా ఎగస్ట్రాలు వాగేశాడు. అంతేనా..? ”నా దగ్గరకు ఎవరైనా పొడవాటి డ్రస్సులు తీసుకొస్తే కాస్ట్యూమ్ డిజైనర్‌తో చెప్పి కట్ చేయించేస్తా.. ఈ విషయంలో హీరోయిన్లు ఫీలైనా నేను పట్టించుకోను” అంటూ హీరోయిన్ల గురించి చీప్‌గా మాట్లాడాడు.
దీనిపై నయనతార స్పందించింది. ”ప్రేక్షకులు డబ్బులిచ్చి టికెట్లు తీసుకొన్నంత మాత్రన అందుకోసం మేం దిగంబరులుగా మారాలా” అంటూ కౌంటరిచ్చింది. ఓ వైపు పింక్, దంగల్ లాంటి చిత్రాల్లో అమ్మాయిల హక్కుల కోసం పోరాడుతుంటే.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ప్రేక్షకులు సూరజ్లా దిగజారలేదు. నా దర్శకులు ఎప్పుడూ నన్ను గ్లామర్ దుస్తుల కోసం ఇబ్బంది పెట్టలేదు. నేనూ కొన్ని వాణిజ్య చిత్రాలు చేశా. అయితే ఎవ్వరూ నన్ను ఇలాంటి బట్టలేసుకోవాల్సిందే అని బలవంతం చేయలేదు. అన్నీ నా ఇష్టప్రకారమే జరిగాయి. కథానాయికలు డబ్బుల కోసం ఏమైనా చేస్తారనుకోవడం పొరపాటు” అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయమై తమన్నా కూడా ఘాటుగానే స్పందించింది. ‘ఒక్కడొచ్చాడు’లో తమన్నానే కథానాయిక. `సూరజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసుండకూడదు` అంటూ తమన్నా ఫీలైంది. దీనిపై సూరజ్ వెంటనే సమాధానం ఇచ్చాడు. ”జరిగిన పొరపాటుకు క్షమించండి. నా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకొంటున్నా” అంటూ ఓ మీడియాకు
రాతపూర్వకంగా నివేదించాడు సూరజ్. ఈ వివాదం ఇక్కడితో సమసిపోతుందా, లేదంటే… దీన్ని హీరోయిన్లంతా పర్సనల్‌గా తీసుకొంటారా? అనేది వేచి చూడాలి.