రాష్ట్రానికి తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తామని తెదేపా, బీజేపీలు ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలు ఇచ్చిన మాట వాస్తవం. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయడానికి ఉన్న సమస్యలు, అవరోధాలు, నియమ నిబంధనలు అన్నీ వారికి ముందే తెలుసు. కానీ అప్పుడు ఎలాగయినా అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత తమకు ముందే తెలిసి ఉన్న ఆ నియమ నిబంధనలు, సమస్యలు, అవరోధాల గురించి ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే తెదేపా, బీజేపీలు అధికారంలోకి రావడానికే ప్రజలను మభ్యపెట్టాయని స్పష్టం అవుతోంది. దీనిని తప్పకుండా అందరూ ఖండించాల్సిందే. అయితే భారతదేశంలో రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడం కోసం ప్రజలను మభ్యపెట్టడం ఇప్పుడేమీ కొత్తగా మొదలవలేదు. ఇదే ఆఖరుసారి కూడా కాదు. తెదేపా, బీజేపీలు కూడా అదే పని చేసాయి. ఈ చేదు వాస్తవాన్ని అందరూ అంగీకరించక తప్పదు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని నేరుగా చెప్పే దైర్యం లేకనే మోడీ ప్రభుత్వం వివిధ సందర్భాలలో వేర్వేరు వ్యక్తుల ద్వారా ఆ సంగతి చెప్పిస్తోంది. ప్రత్యేక హోదా రాదనే సంగతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎప్పుడో తెలుసని, ఆయన అందుకే ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి అడుగుతున్నారని ఆ పార్టీకే చెందిన జేసి దివాకర్ రెడ్డి కుండ బ్రద్దలు కొట్టినట్లు విస్పష్టంగా చెప్పారు. ఆయన మాటలను చంద్రబాబు నాయుడు ఖండించలేదు. అంటే దానిని దృవీకరిస్తున్నట్లే భావించవచ్చును. రాష్ట్ర మంత్రులు, కేంద్రమంత్రులు కూడా ప్రత్యేక హోదా రాదని, సాధించడంలో విఫలమయ్యామని ప్రజల ముందు అంగీకరించలేరు. కనుకనే ఇప్పుడు ప్యాకేజి గురించి మాట్లాడుతున్నారు.
ప్రత్యేక హోదా రాదని అందరూ ఇంత స్పష్టంగా చెపుతున్నప్పుడు కూడా ఈరోజు ఏపీ బంద్ సందర్భంగా వైకాపా అధ్యక్షుడు జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. ఇంతకీ ఏపీకి ప్రత్యేక హోదా కావాలనుకొంటున్నారా లేక అవసరం లేదనుకొంటున్నారా? ప్రత్యేక హోదా వాళ్ళ రాష్ట్రానికి ఉపయోగం ఉందని భావిస్తున్నారా లేదా? కేంద్రాన్ని ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారా లేక ఆర్ధిక ప్యాకేజి కావాలని అడుగుతున్నారా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి తన వైఖరిని స్పష్టంగా ప్రజలకు తెలపాలని జగన్ డిమాండ్ చేసారు. అంటే ఆయనని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలనే తాపత్రయపడుతున్నట్లు స్పష్టం అవుతోంది.
ముఖ్యమంత్రి అంగీకరిస్తే నటుడు శివాజీ చెప్పినట్లు తెదేపా, వైకాపాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో తాత్కాలికంగా వైకాపాది పైచెయ్యి అవుతుంది. ఇప్పటికే భూసేకరణ విషయంలో తెదేపాని వెనక్కి తగ్గేలా చేసి పైచేయి సాధించగలిగింది. కనుక ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో తెదేపా చేత తప్పు ఒప్పించగలిగితే మరో సారి దానిపై పైచేయి సాధించినట్లవుతుంది. కానీ దాని వలన ప్రజలకి ఒరిగేదేమీ లేదు.
ఇదివరకు రాష్ట్ర విభజన జరగడం అనివార్యమని తెలిసినప్పుడూ రాజకీయ పార్టీల ప్రజలను తప్పు ద్రోవ పట్టించాయి తప్ప విభజన సమయంలో రాష్ట్రానికి నష్టం జరగకుండా జాగ్రత్త పడాలని ప్రయత్నించలేదు. రెండు రాష్ట్రాలలో తెదేపాను కొనసాగించుకోవాలనే తపనతో చంద్రబాబు నాయుడు విభజన అనివార్యమని ప్రజలు నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. లోక్ సత్తా అధినేత జయ ప్రకాష్ నారాయణ కూడా ఆ చేదు వాస్తవాన్ని ప్రజలకు తెలియజేసి వారి పోరాటాన్ని సరయిన దిశలో మరిల్చే ప్రయత్నం చేసారు. కానీ వారిరువురూ ప్రజల ఆవేశం చూసి మౌనం వహించాల్సి వచ్చింది. ఆనాడు కళ్ళ ముందు కనబడుతున్న చేదు నిజాన్ని అంగీకరించకపోవడం వలన కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్ని తన ఇష్టం వచ్చినట్లు విభజించి ఏపీకి తీరని అన్యాయం చేసింది.
నిజమయిన నాయకుడు, ప్రజల సంక్షేమం కోరేవాడు ప్రజలను సరయిన దిశలో నడిపిస్తాడు. అందుకు కేసీఆర్ ఒక సజీవ ఉదాహరణగా చెప్పుకోవచ్చును. తెలంగాణా సాధన అనే ఏకైక లక్ష్యం వైపు ప్రజలందరినీ నడిపించి చివరికి అనుకొన్నది సాధించగలిగారు. అందుకు ఆయన ఎంచుకొన్న అనేక మార్గాలలో అనేక లోపాలు ఉండవచ్చును, అనేక ఎత్తులు జిత్తులు ప్రదర్శించి ఉండవచ్చును. కానీ ఆయన ఎన్నడూ తన లక్ష్యాన్ని మరిచిపోలేదు. ప్రజల్నీ మరిచిపోనీయలేదు. అంతే కాదు, ఎన్ని అవాంతరాలు ఎదురయినా దైర్యంగా ముందుకే సాగడంతో అప్పుడు రాష్ట్ర ప్రజలే కాదు రాజకీయ పార్టీలు కూడా ఆయనని అనుసరించక తప్పలేదు.
కానీ విభజన ప్రక్రియ ఒక కొలిక్కి వస్తున్న సమయంలో కూడా ఆంద్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలను త్రప్పు ద్రోవ పట్టించాయి. వారిలో జగన్ కూడా ఒకరు. ఒకవైపు రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసిపోతున్నప్పటికీ రాష్ట్రాన్ని సమైక్యంగా నిలిపి ఉంచుతానంటూ ఉద్యమం చేసారు. ఆ సమయంలో ఆయన పదేపదే ప్రజలకు ఒకే మాట చెప్పారు. తన పార్టీకి ప్రజలు ఓటేసి అధికారం కట్టబెడితే కేంద్రం మెడలు వంచి రాష్ట్ర విభజన నిలిపి వేయిస్తానని చెప్పేవారు. ఒకసారి విభజన జరిగిపోయిన తరువాత రాష్ట్రాన్ని మళ్ళీ కలపడం సాధ్యం కాదని ఆయనకీ తెలుసు…ప్రజలకీ తెలుసు. అయినా చివరి నిమిషం వరకు జగన్ ప్రజలను మభ్యపెట్టారు.
రాజకీయ పార్టీలు చేసిన ఈ నిర్వాకం వలన చివరికి రాష్ర్టం తీవ్రంగా నష్టపోవలసి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అదే తప్పు చేస్తున్నాయి. ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదనే సంగతి దాదాపు స్పష్టం అయిన తరువాత దానిని సాధిస్తామని ఉద్యమం మొదలుపెట్టారు. ప్రత్యేక హోదా లేదా ఆర్ధిక ప్యాకేజీ ద్వారానయినా సరే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగడమే ప్రజలకి కావలసింది. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా మభ్యపెడుతున్నాయనే చేదు నిజం గ్రహించిన తరువాత ఇంకా దాని కోసం ప్రాకులాడుతూ, బందులు, ర్యాలీలు చేసుకొంటూ రాష్ట్రంలో ఒక అనిశ్చిత వాతావరణం సృష్టించుకొని విభజనతో ఇప్పటికే దారుణంగా దెబ్బ తిన్న రాష్ట్రాన్ని చేజేతులా దెబ్బతీసుకొన్నట్లవుతుంది.ఈరోజు ఏపీలో జరిగిన బంద్ విజయవంతం అయ్యిందా లేదా అని అధికార, ప్రతిపక్షాలు లెక్కలు కట్టుకోవడం చూస్తే వాటి రాజకీయ ఉద్దేశ్యాలను అర్ధం చేసుకోవచ్చును. కనుక రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం రాని హోదా కోసం ఇంకా పోరాటాలు కొనసాగించాలా? బలిదానాలు చేసుకోవాలా లేక వాస్తవిక దృక్పధంతో ఆలోచించి కేంద్రం నుండి నిధులు, పరిశ్రమల స్థాపనకు టాక్స్ సబ్సీడీలు, ప్రోత్సహాకాలు రాబట్టుకొని మిగిలిన ఈ నాలుగేళ్ళలో రాష్ట్రాభివృద్ధి చేసుకోవాలా? అని రాజకీయాలకి అతీతంగా ప్రజలు కూడా ఆలోచించవలసి ఉంది.