2015లో అడిగినా… 2016లో అడిగినా… 2017 సమీపిస్తున్నా… పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తెలుగుదేశం సర్కారు ఒకే మాట మీద నిలబడుతోంది! అదేంటంటే… 2018 నాటికి పూర్తి చేసి తీరతామని! అది ఎలా సాధ్యమౌతుందనేది అర్థం కాని ప్రశ్న? ఎలా పూర్తి చేస్తారో అనేది తెలుగుదేశం నేతలు కూడా చెప్పలేని సమాధానం! వాస్తవంలో రెండు శాతం మట్టిపనులు కూడా పూర్తి కాలేదని ప్రభుత్వమే చెబుతూ ఉంటుంది. కానీ, 2018 నాటికి ప్రాజెక్టు పూర్తైపోతుందని ఎప్పటికప్పుడు చంద్రబాబు చెబుతుంటారు. ఇప్పుడు మరోసారి పోలవరం ప్రాజెక్టుకు భారీ ఎత్తున నిధులు వచ్చేశాయని చంద్రబాబు సంబరంగా చెబుతున్నారు. కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు కూడా పోలవరానికి కేంద్రం చాలా ఇచ్చేసిందని చెప్పారు. ఇంతకీ ఇప్పుడు జరిగిన కేటాయింపులు ఏంటయ్యా అంటే.. నాబార్డు నుంచి రూ. 1981.54 కోట్ల అప్పు మాత్రమే!
ఈ మొత్తాన్ని చెక్ రూపంలో చంద్రబాబు అందుకోవడాన్ని ఒక మహద్కార్యంగా దేశం శ్రేణులు చెప్పుకుంటున్నాయి. పోలవరం దశ మారిపోయిందని ప్రచారం మొదలెట్టేశారు. అయితే, ఈ క్రమంలో ఎవ్వరూ మాట్లాడని అంశాలు ఏంటంటే… పోలవరం అంచనా వ్యయం ఎంత? గతంలో వేసిన అంచనాలు కాదు, తాజాగా కావాల్సింది ఎంత మొత్తం..? ఇంతవరకూ కేంద్రం ఇచ్చింది ఎంత..? మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ఇంకా కాల్సిన నిధులు ఎంత..? ఈ అంశాల ప్రస్థావన రానీయకుండా… కేంద్రం ఇచ్చిందే మహాప్రసాదం అన్న రేంజిలో చంద్రబాబు అనుకూల మీడియా కూడా కథనాలు గుప్పించేసింది.
నిజానికి, పోలవరం పూర్తయ్యేందుకు దాదాపు రూ. 40 వేల కోట్ల వ్యయం అవుతుందన్నది అంచనా. గత ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ వంద కోట్లు నిధులను ప్రకటించారు. రూ. 40 వేల కోట్ల అంచనా ఉన్నజాతీయ ప్రాజెక్టుకు రూ. 100 కోట్లు ప్రకటించడం అనేది… ఏ తరహా కంటితుడుపు చర్యో ప్రత్యేకంగా విశ్లేషించుకోవాల్సిన అవసరం లేదు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రాన్ని ఉన్న చిత్తశుద్ధి ఏపాటితో ప్రధాని కేటాయించిన సొమ్మే చెబుతోంది. ఇప్పుడు.. అంటే, ఏడాది తరువాత అప్పు రూపంలో దాదాపు రూ. 1900 కోట్ల పైచిలుకు ఇస్తున్నారు. అంటే, ఇంతవరకూ వచ్చిన నిధులు ఎంతయ్యా మహాశయా… దాదాపుగా రూ. 2 వేల కోట్లే అన్నమాట! అంటే, మొత్తం ప్రాజెక్టు వ్యయంలో మహా అయితే 5 శాతం నిధులు మాత్రమే ఇవి. ఈ లెక్కన మిగతా 95 శాతం నిధులు ఎప్పుడొస్తాయి..? ఏ రూపంలో కేటాయిస్తారు..? చంద్రబాబు చెబుతున్నట్టు 2018 నాటికి పోలవరం ఎలా పూర్తైపోతుందీ అనేది పెరుమాళ్లకే ఎరుక..!!! ఐదు శాతం నిధులకే ఈ రేంజి సంబరాలేంటో, ఈ ప్రచారార్భాటాలేంటో ఏలుతున్నవారికే ఎరుక..!!!