ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఫిరాయింపుల పర్వానికి తెర లేచిందని చెప్పుకోవాలి. ఇప్పటికిప్పుడు వైకాపా నుంచి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న నాయకులపై తెలుగుదేశం దృష్టి సారించిందన్న ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో వైకాపా ఎమ్మెల్యే ఉప్పలేటి కల్పన తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో ఇంకొంతమంది ఎమ్మెల్యేలతోపాటు, స్థానికంగా వైకాపా తరఫున కాస్త బలంగా ఉన్న నాయకులకు కూడా టీడీపీ వలలు వేస్తున్నట్టు సమాచారం. ఇంతకుముందు, రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైకాపా ఎమ్మెల్యేలను ఆకర్షించారు. ఇప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుకునే వ్యూహంలో భాగంగా ఫిరాయింపుల్ని మరోసారి ప్రోత్సహిస్తున్నారని చెప్పుకోవచ్చు.
రాష్ట్రంలో కీలకమైన కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసే యోచనలో సర్కారు ఉందని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటిపోయింది కాబట్టి.. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి గెలుపు చాలా అవసరం. ప్రతిపక్షానికి అవకాశం ఇస్తే… ఆ ప్రభావం రాబోయే ఎన్నికల వరకూ ఉంటుందన్న ఉద్దేశంతోనే, ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే మరోసారి ఫిరాయింపుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించే దిశగా టీడీపీ వ్యూహ రచనలో ఉంది! అయితే, ఈ వ్యూహానికి చెక్ పెట్టేందుకు వైకాపా కూడా సంసిద్ధమౌతున్నట్టు సమాచారం. తాజాగా ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో… పార్టీలో తెలుగుదేశం సానుభూతిపరులు ఎవరైనా ఉన్నారేమో అనే ఆరా తీస్తున్నారట. ముఖ్యంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో ఎన్నికలు జరగబోయే ప్రాంతాల్లోని ఎమ్మెలూ ఇతర నాయకులపై వైకాపా అధినేత జగన్ ప్రత్యేక దృష్టి సారించారట. కొంతమంది నాయకులకు సంబంధించిన వివరాలను కూడా జగన్ తెప్పించుకున్నారనీ, అవసరమైన వారితో సంప్రదింపులు కూడా జరుపుతున్నారని తెలుస్తోంది.
ఓ పక్క నాయకుల్ని కంట్రోల్లో ఉంచుతూనే.. మరోపక్క ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమౌతున్నారు. ప్రత్యేక హోదా రాలేదన్న అసంతృప్తి ప్రజల్లో ఎలాగూ ఉంది. దీంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ కూడా సిద్ధమౌతున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంటే, ఈసారి అధికార పార్టీ ప్రోత్సహించే ఫిరాయింపుల్ని ధీటుగా అడ్డుకోవడంతోపాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటుకునేందుకు వైకాపా వ్యూహాత్మకంగా సిద్ధమౌతోందని తెలుస్తోంది. మరి, ఈ వ్యూహం వైకాపాకు ఏమేరకు ప్లస్ అవుతుందో వేచి చూడాలి.