క్రిష్ ఓ ప్రత్యేకమైన దర్శకుడు. ఆ విషయంలో సందేహమే అక్కర్లెద్దు. క్రిష్ సినిమా అంటే గుండెల మీద చేయి వేసుకొని మరీ హాయిగా చూసేయొచ్చు. ఎక్కడో మన మనసుల్ని మెలితిప్పే, మన కన్నీటికి ఉబికి వచ్చే ప్రయత్నాలు చేస్తుంటాడు. మన మూలాల్ని ఒక్కసారి మనకు గుర్తు చేస్తుంటాడు. గమ్యం నుంచి కంచె వరకూ అదే చేశాడు. కానీ.. అదేం విచిత్రమో ఏ సినిమా కూడా `సూపర్ హిట్ ` అనే ముద్ర వేయించుకోలేకపోయాయి. హిట్ సినిమాలయందు మంచి సినిమాలు వేరయా.. అన్నట్టు వాటినీ ఓ ప్రత్యేక ముద్ర వేసే చూశారు. క్రిష్ కసితో రగిపోతున్నాడు. `మంచి సినిమా. బాక్సఫీసు దగ్గర వసూళ్ల వర్షం ఎందుకు కురిపించుకోకూడదు` అనేదే తన తాపత్రయం. బహుశా అందులోంచే.. గౌతమి పుత్ర శాతకర్ణి కథ, దాన్ని సినిమాగా చేయాలన్న ఆలోచన పుట్టుండొచ్చు. క్రిష్ ప్రయత్నం గొప్పది. దానికి తోడు.. ప్రచార చిత్రాల్లో తను పడిన కష్టం స్పష్టంగా కనిపిస్తోంది. అవే.. ఈ సినమాపై అంచనాల్ని పెంచేశాయి. గౌతమి పుత్ర ఆడియో ఫంక్షన్లో క్రిష్వీరావేశంతో మాట్లాడిన మాటల వెనుక బలం అదే.
ఓ అద్భుతమై సినిమా తీశా, గర్వపడే సినిమా తీశా, గొప్ప సినిమా తీశా.. అంటూ పదే పదే చెబుతున్నాడు క్రిష్. బహుశా.. క్రిష్ మాటల్లో కాస్తంత ఓవర్ కాన్ఫిడెన్స్ ధ్వనిస్తూ ఉండొచ్చు. చివర్లో బోయపాటి శ్రీను స్టైల్లో.. ‘సంక్రాంతికి వచ్చేస్తున్నాం.. ఖబడ్దార్’ అంటూ వార్నింగులు పంపాడు కూడా! సంక్రాంతికి వస్తున్న మరో సినిమా `ఖైదీ`కి ఆ వార్నింగులు వెళ్లుంటాయి కూడా. అయితే.. క్రిష్ స్పీచ్‌కి ఓవరాల్ వ్యాఖ్యానం ఇచ్చుకోవాల్సివస్తే కచ్చితంగా ఇవి ఓవర్ కాన్ఫిడెన్స్ నిండిన మాటలే. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సమయంలో టోన్ డౌన్ చేసుకోవాల్సింది పోయి.. ‘మీరు అద్భుతమైన సినిమా చూడబోతున్నారు’ అంటూ ప్రేక్షకుల్ని హిప్నటైజ్ చేయడం ఎందుకు? వాళ్లు బాహుబలి లాంటి సినిమాని ఊహించుకొని వస్తే.. దాని కంటే గొప్ప సినిమా చూస్తున్నామేమో అనుకొంటూ థియేటర్లలో అడుగుపెడితే… ఇంతకాలం క్రిష్ పడిన కష్టంతా వాళ్లకు అర్థమవుతుందా?? ప్రతీ సినిమాకి ముందు క్రిష్ ఇంతే కాన్ఫిడెన్స్‌తో ఉంటాడు. కంచెకీ ఇదే జరిగింది. ఇలాంటి సినిమా తీయడం నా అదృష్టం, జీవిత కాలంలో ఒక్కసారి వచ్చే అవకాశం అన్నాడు. నిజానికి కంచె కూడా మంచి సినిమానే.కానీ ఆర్థికంగా ఏమైంది?? మంచి సినిమా తీశానన్న ఎగ్జయిట్మెంట్ ఇప్పుడు కాదు, సినిమా రిలీజ్ అయిన తరవాత వ్యక్తపరచుకొంటే బాగుంటుంది. లేదంటే.. ప్రేక్షకులు ఉన్నదానికంటే ఎక్కువ ఆశిస్తారు.. దాంతో ఫలితం తారు మారు అవుతుంది. అందుకే క్రిష్… కాస్త నిదానించు.. నిదానించు!