ఈవారం విడుదలైన సినిమాల్లో సప్తగిరి ఎక్స్ ప్రెస్‌కే వసూళ్లు బాగున్నాయి. వంగవీటి హడావుడి ముందు కనిపించినా తరవాత తుస్సుమంది. ఒక్కడొచ్చాడు అడ్రస్ లేకుండా పోయింది. నెగిటీవ్ టాక్ పిట్టగోడ సినిమాని బాగా దెబ్బకొట్టింది. బీసీల్లో ఎక్స్‌ప్రెస్‌కి మంచి వసూళ్లే దక్కుతున్నాయి. సినిమా ఎలాగున్నా… టైమ్ పాస్ మూవీ అనే ముద్ర పడడంతో వసూళ్లు బాగానే అందుకొంటోంది. ఈ కాన్ఫిడెన్స్ తోనే ఇప్పుడు థియేటర్లూ పెంచారు. దాంతో సప్తగిరిలో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఓపెనింగ్ డే వసూళ్లతో పోల్చుకొంటే శని, ఆది వారాల్లో మంచి కలక్షన్లు వచ్చాయి. దాంతో హీరోగా కంటిన్యూ అవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ 2 తీయాలన్న ఆలోచనలో ఉన్నాడట. అన్నీ కుదిరితే… ఇదే కాంబినేషన్లో సీక్వెల్ ఉంటుందని చెప్పుకొచ్చాడు సప్తగిరి.
అంతే కాదు.. ఓ తమిళ చిత్రం రైట్స్‌ని తీసుకొన్నాడట సప్తగిరి. దాన్ని కూడా రీమేక్ చేసే ప్రయత్నాలు మొదలెట్టినట్టు టాక్. ఈ చిత్రానికి తానే నిర్మాతగా వ్యవహరించాలనుకొంటున్నాడట. అయితే.. ఈమధ్యలో కమెడియన్‌గా ఎన్ని అవకాశాలొచ్చినా ఒప్పుకొంటానని, కామెడీ పాత్రల్ని వదిలే ప్రసక్తి లేదని చెబుతున్నాడు. రూ.7 కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో సప్తగిరి ఎక్స్ ప్రెస్ తెరకెక్కింది. కొన్ని చోట్ల ఈ సినిమాని మంచి రేట్లకే అమ్మారు. శాటిలైట్ అన్నీ కలుపుకొంటే నిర్మాత హ్యాపీగా గట్టెక్కే అవకాశాలున్నాయి. చాలామంది కామెడీ హీరోలతో పోలిస్తే సప్తగిరికి వచ్చిన ఈ రిజల్ట్ గొప్పదే మరి.