ప్రఖ్యాత టెన్నిస్ క్రీడాకారిణి, హైదరాబాదీ సంచలనం సానియా మిర్జా కీర్తి కరీటంలో మరో కలికితురాయి చేరింది. ఆమెకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు లభించింది. రాష్ట్రపతి భవన్ లో శనివారం సాయంత్రం ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సానియా ఈ పురస్కారాన్ని అందుకుంది. ఖేల్ రత్న అవార్డు అందుకున్న రెండో టెన్నిస్ ప్లేయర్ సానియా. అంతకు ముందు లియాండర్ పేస్ కు ఈ పురస్కారం దక్కింది.
హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతిని భారత్ జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకొంటుంది. ఈ సందర్భంగా ఏటా క్రీడా రంగంలో ఉన్న పురస్కారాలను బహూకరించడం ఆనవాయితీ. సానియాకు ఖేల్ రత్న అవార్డు అందజేసిన తర్వాత పలువురు క్రీడాకారులకు అర్జన అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. టెన్నిస్ లో సంచలన విజయాలను సాధించిన సానియా మిర్జాకు ఈ అవార్డు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కర్ణాటకకు చెందిన ఓ పారాలపింయన్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ అవార్డు పొందడానికి అర్ఘత ఉన్న తనకు అన్యాయం జరిగిందని వాదించాడు. దీంతో కర్ణాటక హైకోర్టు కేంద్రానికి నోటీసు జారీ చేసింది.
అయితే ముందుగా నిర్ణయించిన ప్రకారం అవార్డుల ప్రదానం జరిగింది. కోర్టు సూచించిన ప్రకారం కేంద్రం అఫిడవిట్ దాఖలు చేస్తుందని, ఆ కేసులో నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తుందని క్రీడా శాఖ అధికారులు తెలిపారు. క్రీడా అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం జరపాలని కేంద్రం నిర్ణయించింది. ఆ ప్రకారమే రాష్ట్రపతి భవన్ లో ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. పలువురు క్రీడా, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖుల సమక్షంలో అవార్డుల ప్రదాన కార్యక్రమం వైభంగా జరిగింది.