మంత్రి వర్గ విస్తరణ జరిగి ఉంటే ఆయన ఈపాటికి మంత్రి అయిపోయి ఉండేవారు! టీడీపీ అదృష్టం కొద్దీ విస్తరణ జరలేదు, ఆయన ఇంకా మంత్రి కాలేదు. ఒకవేళ ఆయన విద్యా శాఖ మంత్రి అయి ఉంటే హైటెక్ సీఎం అని చెప్పుకుంటున్న చంద్రబాబు పరువు కాస్తా గంగలో కలిసిపోయేది! ఇంతకీ ఆయన ఎవరంటే… వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీకి ఫిరాయించిన నేత జలీల్ ఖాన్. వైకాపా టికెట్‌పై గెలిచి టీడీపీలోకి ఫిరాయించినట్టుగానే… బీకామ్లోకి ఫిజిక్స్, మ్యాథ్స్‌ను తెచ్చేశారు..!
ఓ ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ.. తనకు చిన్నప్పటి నుంచీ లెక్కలంటే చాలా ఇష్టం అని చెప్పారు. అదేంటో చిన్నప్పటి నుంచే తనకు 100కు 100 మార్కులూ వచ్చేస్తుండేవట. లెక్కలంటే అప్పట్నుంచీ అంత ఇష్టం, సబ్జెక్టు మీద మాంచి కమాండ్ ఉండటంతోనే బీకామ్‌లో చేరారట. మ్యాథ్స్‌తోపాటు ఫిజిక్స్ కూడా చదువుకున్నారని ఆయనే స్వయంగా చెప్పారు! ఈ దెబ్బతో ఆశ్చర్యపోవడం ఇంటర్వ్యూ చేస్తున్న పాత్రికేయుని వంతైంది. ‘లేదు సార్… మీరు కాస్త పొరబడ్డట్టున్నారు. బీకామ్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ ఉండవు. అకౌంట్స్ లాంటివి ఉంటాయి. నేను కూడా బీకామ్ చదువుకున్నాను’ అని విలేకరి చెప్పినా జలీల్ ఖాన్ వినరాయె!
మ్యాథ్స్, ఫిజిక్స్ బీకామ్‌లో ఉండవని చెప్పినా.. ‘ఉంటాది ఉంటాది. ఫిజిక్స్ ఎందుకు ఉండదు బీకామ్‌లో..? మ్యాథ్స్ అంటే అకౌంట్లే కదా. దాన్లో ఎకానామిక్స్ ఉంటాయి. దాంతోపాటు ఫిజిక్స్ కూడా ఉంటదిగా! కానీ, మ్యాథ్స్ మాత్రం డెఫినెట్‌గా ఉంటాది’ అలా ఏదో గాంభీర్యం నటిస్తూ మెల్లగా కవర్ చేసుకునేందుకు ట్రై చేశారు.
మ్యాథ్స్, ఫిజిక్స్ ఎందులో ఉంటాయో కూడా తెలీదు. పైగా, బుకాయింపు ఒకటీ! ఆ రెండు సబ్జెక్టుల్నీ కలిపేసి బీకామ్‌లో పెట్టేశారు. చదువుల మీద కనీస అవగాహనలేనివారు కూడా నాయకులుగా చెలామణి అయిపోతున్నారు. మంత్రి వర్గ విస్తరణ జరిగితే ఆయనకు కూడా మంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. బీకామ్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్ చేర్చిన జలీల్ ఖాన్‌కి విద్యా శాఖ ఇస్తే చాలా బాగుంటుందనీ, కొత్త కొత్త కోర్సుల్ని ఆయన కనిపెట్టే అవకాశం ఉంటుందని సోషల్ మీడియాలో సెటైర్లు పడిపోతున్నాయి. ఆయనకి తెలియని విషయాన్ని ఒప్పుకుంటే తల తెగిపడిపోదు కదా!
ఇలాంటి నాయకుల్ని చూస్తున్నప్పుడే… ఎమ్మెల్యే టిక్కెట్టుకు కూడా కనీస విద్యార్హత తప్పనిసరి చేయాలన్న చర్చ తెరమీదికి వస్తుంటుంది. కనీసం డిగ్రీ పాసైనవారికే ఎమ్మెల్యే టికెట్ అని కనీసార్హత పెడితే… ఇలాంటి దారుణాలు చూడాల్సి వచ్చేది కాదు! దురదృష్టం ఏంటంటే.. ఇలాంటి చట్టాలను రూపొందించాల్సింది రాజకీయ నాయకులే కదా! వారిలోనూ నిశానీ బ్యాచ్ ఎక్కువ కదా!